రెగ్యులర్‌ చేయకపోతే సమ్మె తప్పదు

రెగ్యులర్‌ చేయకపోతే సమ్మె తప్పదు - Sakshi


► విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

► కార్మిక మంత్రికి అవగాహన లేదు

► యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబ్రహ్మాచారి
అరసవిల్లి : రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్‌ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యూఈఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.నాగబ్రహ్మాచారీ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మె తప్పదని స్పష్టం చేశారు.ఆదివారం శ్రీకాకుళంలోని అవోపా కల్యాణ మండపంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెగ్యులరైజేషన్‌ అంశాన్ని పెట్టి ఇప్పుడు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ, తమిళనాడు , హర్యానా రాష్ట్రాలు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అంగీకారం తెలుపుతూ చర్యలకు దిగాయని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అసెంబ్లీలో విరుచుకుపడటం తప్ప కార్మికుల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులున్నారనే విషయం కూడా మంత్రికి తెలియకపోవడం దారుణమన్నారు. కేవలం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే ఉన్నారని చెప్పడం మంత్రి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై మొదటి దశ పోరాటం చేశామన్నారు. అయినా కనీసం స్పందించకపోవడంతో రెండో దశగా జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని ప్రకటించారు.

 

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సంఘ జిల్లా కార్యదర్శి పి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు యోగేశ్వరరావు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరరావు, కె.వి.కృష్ణారావు, జి.సుదర్శనరావు, రమణమూర్తి, త్రినాథరావు, కుమారస్వామి, సురేష్‌ బాబు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top