
పద్ధతి మారాలి
తీసుకుంటున్న జీతాలకు సక్రమంగా విధులు నిర్వహించాలి. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.
– వైద్యవిధాన పరిషత్ చైర్మన్ బీకే నాయక్
హిందూపురం టౌన్ : ‘‘తీసుకుంటున్న జీతాలకు సక్రమంగా విధులు నిర్వహించాలి. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. లక్షలు చెల్లిస్తున్నా అపరిశుభ్రత నెలకొంది. పద్ధతి మార్చుకోవాలి.’’ అంటూ వైద్య విధాన పరిషత్ చైర్మన్ బీకే నాయక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న డయాలసిస్ సెంటర్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డు, ఎన్టీఆర్ వైద్య సేవ సెంటర్, ముందుల గది తదితర వాటిని ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. పడకలపై చిరిగిపోయిన దుప్పట్లు, వెలగని లైట్లు, అక్కడక్కడా వదిలివేసిన సామగ్రి, మరుగుదొడ్లు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించి శుభ్ర చేయించాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ వైద్య సేవ కేంద్రం ఉన్నా కేసులు రెఫర్ చేస్తుండటంపై అసంతప్తి తెలిపారు. ఆర్థోసర్జన్, ఇతర సర్జన్లు ఉన్నా ఆస్పత్రిలో ఎందుకు శస్త్రచికిత్సలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయని, ఇక్కడే ఆర్థోకు సంబంధించిన శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. మందుల, ఓపీ వివరాలు డ్యాష్ బోర్డులో చేర్చకపోవడంతో వైద్య సిబ్బంది పనుల్లో బద్దకించకుండా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం ఆస్పత్రి వర్గాలతో సమావేశం నిర్వహించారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది, మందుల కొరత, తాగునీటి సమస్యపై చర్చించారు. దీంతో పాటు ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా అభివద్ది చేయడంపై నివేదికలు ముఖ్యమంత్రికి చేరాయన్నారు. అలాగే ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి ఎన్టీఆర్ వైద్య సేవపై చర్చిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు సైతం విధుల్లో అలసత్వం వహించకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్‌ఓ రమేష్‌నాథ్, అభివద్ధి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, మెడికల్ సూపరింటెండెంట్ కేశవులు, ఆర్‌ఎంఓ రుకిణమ్మ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.