వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం | Sakshi
Sakshi News home page

వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం

Published Sat, Apr 29 2017 11:38 PM

వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం

బొమ్మనహాళ్‌ (రాయదుర్గం) : బొమ్మనహాళ్‌లో అశేష జనవాహిన మధ్య వెంకటేశ్వరస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, రథాంగ హోమం, రథ బలి, మాలవీధుల మడుగు రథోత్సవం చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం శ్రీవారిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అనంతరం రథోత్సవంపై ఆసీనులు చేశారు.

అనంతరం రథోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, ప్రజలు, భక్తులు లాగారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై స్వామివారి రథోత్సవం ఊరేగింపుగా సాగింది. గ్రామంలో వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ శ్రీరాం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement