మల్లన్నసాగర్‌పై నీచ రాజకీయాలు! | underhanded politics! | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్‌పై నీచ రాజకీయాలు!

Jul 26 2016 11:30 PM | Updated on Oct 1 2018 2:11 PM

మల్లన్నసాగర్‌పై నీచ రాజకీయాలు! - Sakshi

మల్లన్నసాగర్‌పై నీచ రాజకీయాలు!

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల క్షేమం కోరి చేపడుతున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డుతగలడం నీచరాజకీయాలకు దిగజారడమేనని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

సాక్షి ప్రతినిధి నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల క్షేమం కోరి చేపడుతున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డుతగలడం నీచరాజకీయాలకు దిగజారడమేనని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడంతో పాటు ప్రజలు మమ్మల్ని గుర్తించరనే భయంతో ఏదో ఒక అంశాన్ని  ముందేసుకొని చెడగొట్టే కార్యక్రమాలకు దిగుతున్నారన్నారు. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులను రెచ్చగొడుతున్నారని, ప్రతిపక్షాలు సహకరించి పద్ధతి మార్చుకోకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్‌ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో బీడుబడిన భూములను సస్యశ్యామలం చేసి శాశ్వతంగా కరువు బారిన పడకుండా చేయడానికి రూ. 83 వేల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలు కలిపి పాత ఆయకట్టు 20 లక్షలు , కొత్త ఆయకట్టు 20 లక్షలు మొత్తం 40 లక్షల ఆయకట్టుకు నీరు ఈ ప్రాజెక్టుకు రీ డిజైన్‌ చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం టెండర్లు పిలిచారని పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో తమకు ప్రజల మద్దతు ఉండదని భయంతో మల్లన్నసాగర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును అక్కడే నిర్మిస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్న సోయి కేసీఆర్‌కు వచ్చిందని, కాని నీకు ఎందుకు రాలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. 60 ఏళ్ల పరిపాలనలో మీరు ఏమి చేశారని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కుట్రరాజకీయాలు చేస్తున్నారని, నీచరాజకీయాలకు దిగజారుతున్నారని మండిపడ్డారు. ఎవరైన నీరు, ప్రాజెక్టులు తెస్తుంటే శత్రువులైన సహకరిస్తారని అలాంటిది రాజకీయ అజ్ఞానులు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు సహకరించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలు అడ్డుతగిలి అడ్డుకుంటే ప్రజలే  బుద్ధి చెప్తారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫెదారు రాజు, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్మే బిగాల గణేష్‌గుప్త, నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement