గిరిజన సమావేశం రసాభాస | tribal welfare meeting distrubed | Sakshi
Sakshi News home page

గిరిజన సమావేశం రసాభాస

Jul 21 2016 11:50 PM | Updated on Sep 4 2017 5:41 AM

గిరిజన సమావేశం రసాభాస

గిరిజన సమావేశం రసాభాస

గుంటూరు వెస్ట్‌ : జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు గిరిజన సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది.

 గుంటూరు వెస్ట్‌ : జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు గిరిజన సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి గిరిజన సంఘాల నాయకులు అందరికీ సమాచారం ఇవ్వలేదని, అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ నాయకులు మండిపడ్డారు. సమావేశాన్ని బహిష్కరించి ధర్నాకు దిగారు.  వివరాల్లోకి వెళితే...
  ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లపై చర్చించేందుకు గుంటూరు నగరంలోని ఎస్సీ  కార్పొరేషన్‌ సమావేశపు హాలులో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి(డీటీడబ్ల్యూవో) వి.నారాయణుడు గురువారం వివిధ గిరిజన సంఘాల నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వివిధ గిరిజన సంఘాల నాయకులు కె.వెంకటేశ్వరరావు, కృష్ణానాయక్, కుంభా నాగేశ్వరరావు, యేసుబాబు, మొగిలి శివకుమార్, దేవరకొండ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణుడు మాట్లాడుతూ ప్రతిఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని చెప్పారు.  ఏర్పాట్లపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో గిరిజన నాయకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో గిరిజన కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని ఇచ్చిన గతం లో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్‌లో తీర్మానం చేసి స్థలం కేటాయించినా అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  నెలరోజుల్లో గిరిజన భవన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని గత ఏడాది ఆదివాసీ వేడుకల్లో కలెక్టర్‌ హామీఇచ్చినా,  ఇంతవరకు ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. సమావేశాన్ని బహిష్కరించి, హాలు వెలుపల ధర్నాకు దిగారు. కలెక్టర్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  
రావెలకు వ్యతిరేకంగా నినాదాలు
 
రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబుకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల నాయకులు నినాదాలు చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చకుంటే ఆగస్టు 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. సుమారు రెండుగంటలపాటు ధర్నా కొనసాగింది.  సమస్యలను కలెక్టర్‌ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement