రాజధానికి రైలు కరువు | train miss in tadipatri | Sakshi
Sakshi News home page

రాజధానికి రైలు కరువు

Jan 28 2017 10:33 PM | Updated on May 25 2018 7:04 PM

రాజధానికి రైలు కరువు - Sakshi

రాజధానికి రైలు కరువు

జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే గ్రానైట్, నల్లబండల పరిశ్రమలకు కేరాఫ్‌గా ఉన్న తాడిపత్రి నుంచి రాజధాని అమరావతికి రైలు కరువైంది.

–తాడిపత్రిలో ఆగని ప్రధాన రైళ్లు
–ఏళ్ల తరబడి ప్రతిపాదనలు బుట్టదాఖలు
–ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


తాడిపత్రి : జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే గ్రానైట్, నల్లబండల పరిశ్రమలకు కేరాఫ్‌గా ఉన్న తాడిపత్రి నుంచి రాజధాని అమరావతికి రైలు కరువైంది. దీనివల్ల వ్యాపారులు, ప్రజలు అవస్థ పడుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం నుంచి గుంటూరుకు గానీ,  విజయవాడకు గానీ రైలు సౌకర్యమే లేదు. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు సరిహద్దుగా కూడా ఉన్న తాడిపత్రి నుంచి ప్రతి రోజూ వందలాది మంది విజయవాడకు వెళుతుంటారు. అయితే.. తాడిపత్రి రైల్వే స్టేషన్‌ నుంచి నేరుగా రైలు సౌకర్యం లేదు. అనంతపురం, గుత్తి, గుంతకల్లులో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి.. అక్కడి నుంచి ప్రయాణించాల్సిందే. పట్టణ జనాభా 1.08 లక్షలు. ఎనిమిది మండలాలకు కేంద్రబిందువుగా ఉంది.

రెండు ఉక్కు, మూడు సిమెంట్, 600 నల్లబండల, 250 గ్రానైట్‌ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల మంది కార్మికులు   పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ముంబాయి– చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న తాడిపత్రి రైల్వే సేషన్‌ నుంచి ప్రతి రోజు 1,500 మందికిపైగా ప్రయాణిస్తుంటారు. మొత్తం 18 రైళ్లు ప్రతి రోజు ఈ స్టేషన్‌ గుండా వెళుతున్నాయి. మరో 18 రైళ్లు వారానికి ఒకసారి, వారంలో రెండు, మూడు రోజులు వెళ్తుంటాయి.  ఎనిమిది రైళ్లు ఇక్కడ ఆగకుండానే వెళ్తుండడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ఇక్కడ ముఖ్యమైన రైళ్లను ఆపాలని రోటరీ, లయన్స్‌ క్లబ్,  ప్రజా సంఘాల నేతలు  చాలాసార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేదు.

ప్రతిపాదనలు ఉన్నా...
    ముఖ్యమైన రైళ్లు తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో ఆపాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రైల్వే శాఖ ఆమోదం తెలపలేదు. ఇందులో ప్రధానంగా మధురై–లోకమాన్యతిలక్, లోకమాన్యతిలక్‌–మధురై, ఒఖా–రామేశ్వరం, రామేశ్వరం–ఒఖా, మంగళూరు–సికింద్రాబాద్, సికింద్రాబాద్‌–మంగళూరు రైళ్లు ఆపాలని  కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం–నౌషాద్, స్టేషన్‌ మేనేజర్, తాడిపత్రి రైల్వేస్టేషన్‌
తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో నాలుగు ప్రధాన రైళ్లు ఆపాలని ప్రతిపాదనలు పంపించాం. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. రాజధాని అమరావతికి  కూడా రైలు డిమాండ్‌ ఉంది. రాజధానికి రైలుతో పాటు  ముఖ్యమైన నాలుగు రైళ్లు ఆగితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

ధర్మవరం–బెజవాడ రైలు తాడిపత్రి గుండా నడపాలి–రజాక్, తాడిపత్రి
విజయవాడ, గుంటూరుకు వెళ్లాలంటే చాలా ఇబ్బదిగా ఉంది. గుంతకల్లు, అనంతపురం, గుత్తిలో ఏదో ఒకచోటకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ధర్మవరం–బెజవాడ రైలును నంద్యాల, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి మీదుగా మళ్లిస్తే బాగుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement