అంతా మోసం | TOTAL CHEATIING | Sakshi
Sakshi News home page

అంతా మోసం

May 27 2017 2:02 AM | Updated on Sep 5 2017 12:03 PM

అంతా మోసం

అంతా మోసం

రోజురోజుకు మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం వీరు పన్నే వలలో అమాయకులు చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు...

 రోజురోజుకు మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం వీరు పన్నే వలలో అమాయకులు చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులకు వచ్చిన వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే ఫోన్‌ చేసి ఏటీఎం వివరాలు తెలుసుకుని ఖాతాదారులను మోసగిస్తున్న ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జిల్లాలోని ఓ కల్తీ పాల కేంద్రంపై అధికారులు దాడి చేసి మోసాన్ని బయటపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 
 
‘ఎస్‌బీఐ నుంచి ఫోన్‌ చేస్తున్నాను..’
జంగారెడ్డిగూడెం : “హలో... ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నాం... మీరు ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారు కదా! ఆ కార్డు మీద పాయింట్లు వచ్చాయి.. ఆ పాయింట్లను నగదుగా మార్చాలి.. మీ కార్డు వివరాలు తెలియజేయగలరు.’ ఇలా ఒక ఆగంతకుడు ఫోన్‌ చేసి సదరు వ్యక్తి ఖాతాలోని నగదు డ్రా చేసి బురిడీ కొట్టించాడు. గురువారం జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకోగా బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.కేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పీవీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ జంగారెడ్డిగూడెం ఎస్‌బీఐలో ఖాతా కలిగి ఉన్నాడు. ఏటీఎం కార్డు వినియోగిస్తున్నాడు. ఆగంతకుడు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్న అనంతరం స్వల్ప వ్యవధిలో మూడుసార్లు కార్డు నుంచి 14,985 రూపాయలు విత్‌ డ్రా చేశాడు. ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.  
బామ్మకు టోకరా.. నగలతో జంప్‌ 
ఏలూరు అర్బన్‌ : బ్యాంకులో నగలు కుదువపెట్టి డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలిని మాయచేసిన మోసగాడు ఆమె తెచ్చుకున్న నగలు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక వంగాయగూడెం సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన చిల్లా పార్వతి తన వద్ద ఉన్న 12 గ్రాముల విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు స్థానిక వన్‌టౌన్‌ కెనాల్‌రోడ్‌లోని విజయబ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఆమెకు డబ్బు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమె నుంచి నగలు తీసుకుని ఆధార్‌ కార్డు జిరాక్సు తీసుకురమ్మని ఆమెను బయటకు పంపాడు. కార్డు జిరాక్స్‌ తీసుకువచ్చిన ఆమెకు ఆగంతకుడు కనిపించకపోవడంతో అక్కడే ఉన్న కార్పొరేటర్‌ రాధాబాబుకు మొరపెట్టుకుంది. ఆయన బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీంతో వారు సీసీ ఫుటేజ్‌ పరిశీలించి మోసగాణ్ణి గుర్తిస్తామని చెప్పారు. బాధితురాలు కార్పొరేటర్‌ సహకారంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 
కల్లీ పాలు తయారీ కేంద్రం గుట్టు రట్టు!
కామవరపుకోట : మండలంలోని సాగిపాడు పంచాయతీ పరిధిలోని వీరంపాలెం గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తోన్న ఒక ఇంటిపై తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్థన్‌ శుక్రవారం దాడి చేశారు. అనంతరం పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకటరామయ్యకు సమాచారం అందించారు. ఎస్సై సమక్షంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ పాలను పరీక్షించారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలం ఆసన్నగూడెంకు చెందిన జెట్టి మోషే ఐదు నెలలుగా మంగతాయారు అనే మహిళకు చెందిన ఇంటిలో ఒక గది అద్దెకు తీసుకుని కల్తీ పాలు తయారు చేస్తున్నాడు. అసలు పాలకు నీళ్లు కలిపి దానిలో మంచునూనె, పాల పౌడర్‌ కలిపి మిక్సిలో ఆడి వచ్చిన ద్రవ్యాన్ని బయట ప్రజలకు అమ్ముతున్నాడు. దాడిలో పాల తయారీకి ఉపయోగించే నూనె ప్యాకెట్లు, పాల పౌడర్‌ ప్యాకెట్లు, మిక్సీ, రెండు క్యాన్ల పాలు సీజ్‌ చేసినట్టు ఎస్సై చెప్పారు. పాల నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement