తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎడ్ సెట్ గోల్ మాల్ ర్యాంకులకు సంబంధించిన ర్యాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎడ్‌సెట్-2015లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎడ్‌సెట్ దరఖాస్తులో తమ ఫొటోలకు బదులు.. ఇతరుల ఫొటోలను అభ్యర్థులు అప్‌లోడ్ చేశారు. పరీక్షకు కూడా అసలు అభ్యర్థులకు బదులు.. వీరే రాశారు.
అయితే వీరిద్దరికే ఎడ్‌సెట్ ఫలితాల్లో సాంఘికశాస్త్రం, మెథడాలజీలో మొదటి, రెండు ర్యాంకులు దక్కడం గమనార్హం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంలకు చెందిన వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలు. విద్యార్థుల మోసాలపై ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో దరఖాస్తు చేసిన అసలు అభ్యర్థులు మాలిగ కృష్ణకాంత్, ఎం.లింగస్వామిలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.