విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ | telangana as a seed production centre | Sakshi
Sakshi News home page

విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ

Aug 23 2016 9:13 PM | Updated on Sep 4 2017 10:33 AM

ఎర్రవల్లిలో సోయాబీన్‌ పంట పరిశీలన

ఎర్రవల్లిలో సోయాబీన్‌ పంట పరిశీలన

తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌, వ్యవసాయ అనుబంధ శాఖల కార్యదర్శి పార్థసారథి అన్నారు.

  • ఆ దిశగా చర్యలు
  • వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి
  • సీఎం దత్తత గ్రామాల్లో పర్యటన
  • జగదేవ్‌పూర్‌: తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌, వ్యవసాయ అనుబంధ శాఖల కార్యదర్శి పార్థసారథి అన్నారు. మంగళవారం  సీఎం దత్తత గ్రామాలైన జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి, ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకటరామ్‌రెడ్డిలతో కలిసి సోయాబీన్‌ పంటను పరిశీలించారు.

    అనంతరం రైతులతో ముఖాముఖీ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ... రాష్ట్రంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటి కుంటల పునరుద్ధరణతోపాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మొదటిసారిగా దాదాపు 5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు నుంచి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వర్ష ఆధారిత ప్రాంతమైన రాష్ట్రంలో పత్తిసాగును రైతులు తగ్గించి ఉద్యాన సాగు ద్వారా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.

    నాణ్యమైన సోయాబీన్‌ విత్తన ఉత్పత్తి పంట సస్యరక్షణకు క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తల సూచనల మేరకు సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 2.5 లక్షల హెక్టార్ల పప్పు ధాన్యాలు సాగవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 520 గ్రామాల్లో దాదాపు 10 వేల మంది రైతులు 45 వేల హెక్టార్లలో సోయాబీన్‌ విత్తన ఉత్పత్తి సాగు చేస్తున్నారని చెప్పారు. వారం పది రోజులుగా వర్షాలు లేక మొక్కజొన్న ఎండిపోతుందని, సోయాబీన్‌ ఆరిపోతుందన్నారు.

    క్షేత్రస్థాయిలో పరిశీలన
    రాష్ట్రంలో పంటల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు పార్థసారథి తెలిపారు. రైతులకు పంట రక్షణ కోసం సాంకేతిక సలహాలిస్తామన్నారు. 27 తర్వాత మంచి వర్షాలు ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. సీఎం దత్తత గ్రామాల్లో పంట రక్షణ కోసం బోరుబావి ఉన్న రైతుకు స్ప్రింక్లర్లను అందించాలని ఆదేశించారు. తపాస్‌పల్లి డ్యాం నుంచి రెండు గ్రామాల్లో చెరువు, కుంటలకు నీరు ఇప్పుడు సాధ్యకాదని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం అలోచిస్తుందన్నారు.

    డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అద్భుతం
    ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని పార్థసారథి అన్నారు. ఎర్రవల్లిలో నమూనా ఇంటిని ఆయన పరిశీలించారు. ఆయన వెంట జేడీఏ మాధవిశ్రీలత, ఉద్యాన శాఖ డీడీ రామలక్ష్మి, ఏడీఏ అశోక్‌కుమార్‌, గఢా అధికారి హన్మంతరావు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్‌, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, కృష్ణ, బాల్‌రాజు, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, మల్లేశం రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement