ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు

Published Tue, Jan 3 2017 9:37 PM

ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు

– ఎంపీ బుట్టా రేణుక
– 200 మంది ఉపాధ్యాయులకు అవార్డులు
– రక్తదానం చేసిన యువత
– ఘనంగా సావిత్రిబాయి పూలే 185వ జయంతి 
 
కర్నూలు(అర్బన్‌) : ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిఽబాయి పూలే 185వ జయంతి ఘనంగా జరిగింది. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డీఐజీ బీవీ రమణకుమార్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. నాటి ఆచారాలు, కట్టుబాట్లకు ఎదురొడ్డి భర్త జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రిబాయి ఉపాధ్యాయురాలిగా ఎదిగి సమాజానికే మార్గదర్శకురాలయ్యారని ఎంపీ కొనియాడారు. కుటుంబంలోని తండ్రి, భర్త సహకారం అందిస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారన్నారు. ఇటీవల మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని,  అందుకు కారణాలను విశ్లేషిస్తే వాటిని అరికట్టవచ్చన్నారు. మంచి సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమన్నారు. డీఐజీ రమణకుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు  ప్రణాళిక ప్రకారం విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో 200 మంది ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. సభాధ్యక్షుడు లక్ష్మినరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను శాసనసభ బీసీ కమిటీ చైర్మన్‌ తిప్పేస్వామి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి ఎంతో కృషి చేశారని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ శేషఫణి, మాకం నాగరాజు, బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల సమాఖ్య మహిళా కన్వీనర్‌ పట్నం రాజేశ్వరి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్, గొర్రెల సహకార సంఘం చైర్మన్‌ వై నాగేశ్వరరావు యాదవ్, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, వాడాల నాగరాజు, ఉపాధ్యాయ ఎంపిక కమిటీ సభ్యులు ఓంకార్‌యాదవ్, విజయభాస్కర్‌యాదవ్, మియ్యా పాల్గొన్నారు.
 
 యువత రక్తదానం
ఈ సందర్భంగా పలువురు బీసీ వర్గాలకు చెందిన యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న మియ్యా గీతాలు ...
కార్యక్రమంలో అభ్యుదయ గాయకులు మహమ్మద్‌మియ్యా ఆలపించిన పలు గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించి ‘ ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటీ నువు చేయలేనిది ’ అనే గీతం ఆహుతులతో పాటు వేదికపైన ఉన్న వారి గుండెలను హత్తుకుంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement