ప్రతి ఆసుపత్రిలో స్వచ్ఛభారత్‌ నిర్వహించాలి | swatchbharath in every hospital | Sakshi
Sakshi News home page

ప్రతి ఆసుపత్రిలో స్వచ్ఛభారత్‌ నిర్వహించాలి

Sep 7 2016 10:51 PM | Updated on Sep 4 2017 12:33 PM

zpchairman

zpchairman

ప్రతి హాస్పిటల్లో స్వచ్ఛభారత్‌ నిర్వహించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు అధికారులను ఆదేశించారు.

- కాంపౌండ్‌ వాల్స్‌ ఉన్న ఆసుపత్రుల్లో బయోడైవర్సిటీల నిర్మాణం
- ఏటా పశు ప్రదర్శనలు ఏర్పాటు  
- పశుసంవర్ధక శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ ఈదర 
ఒంగోలు:  ప్రతి హాస్పిటల్లో స్వచ్ఛభారత్‌ నిర్వహించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్పిటల్‌లు ఎల్లప్పుడూ తెరచి ఉంచాలని, సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రజనీకుమారికి సూచించారు.
 
ప్రహరీలు ఉన్న హాస్పిటల్స్‌ ఆవరణలో మొక్కల పెంపకం, పక్షుల ఆవాసాలను ఏర్పాటు చేసి బయోడైవర్సిటీలుగా మార్చాల్సిన అవసరాన్ని చర్చించారు. బీమా పరిష్కారాలకు సంబంధించి సత్వర నిర్ణయాలు ఉండాలని, ప్రతి డివిజన్‌కు ఒక మండలాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ హాస్పిటల్స్‌లో అన్ని రకాల వసతులు కల్పించి ఆదర్శ మండలంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నవాటిపై సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులతో మరోమారు సమీక్షించాలని నిర్ణయించారు.
 
ఈ సందర్భంగా జేడీ రజనీకుమారి మాట్లాడుతూ జిల్లాలో 231 హాస్పిటల్స్‌ ఉన్నాయని, అయితే వాటిలో దాణా నిల్వకు, సైలేజీ నిల్వకు స్టోర్‌రూంల అవసరం ఉందన్నారు. సంతనూతలపాడు పశువైద్యశాల శిథిలావస్థలో ఉందని, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న కార్యాలయం పల్లంగా ఉందని, దానిని లెవలింగ్‌ చేయించాల్సిన అవసరాన్ని వివరించారు. అంచనాలు తయారు చేయించి పంపిస్తే జనరల్‌ బాడీలో తీర్మానం చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈదర వారికి స్పష్టం చేశారు.
 
ప్రతి ఏడాది జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో పశువులకు సంబంధించి అందాల పోటీలు, పాల పోటీలు, హింసలేని పశువుల బల ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. విజేతలకు మెమెంటోలు, నగదు బహుమతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వెటర్నరీ ఫెస్టివల్స్‌ నిర్వహించాలన్నారు. ఇందుకు దాతల సాయాన్ని కోరాలని సూచించారు. యువ డాక్టర్లకు పోటీలు ఏర్పాటు చేసి సన్మానించదలిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కందుకూరు సహాయ సంచాలకులు డాక్టర్‌ షేక్‌ కాలేషా, ఒంగోలు సహాయ సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.మురళీకృష్ణ , జిల్లా ప్రజా పరిషత్‌ సూపరింటిండెంట్‌ వి.సాంబమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement