కల్తీ మద్యం కేసు కొలిక్కి రాలేదు. ఈ కేసుపై నియమించిన పోలీస్ ఉన్నతాధికారుల బృందం (సిట్) రిపోర్టు ఇవ్వలేకపోతున్నారు.
	కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
	తవ్వేకొద్ద్దీ బయటికొస్తున్న లోపాలు
	నిర్ధారణకు రాని బృందం
	 
	విజయవాడ : కల్తీ మద్యం కేసు కొలిక్కి రాలేదు. ఈ కేసుపై నియమించిన పోలీస్ ఉన్నతాధికారుల బృందం (సిట్) రిపోర్టు ఇవ్వలేకపోతున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయినా కేసు దర్యాప్తు ముగించలేకపోయారు.
	 
	మద్యంలోనే కల్తీ ఉంది?
	 మద్యంలో కల్తీని నిరూపించడం ఎలా? ఇప్పుడు పోలీసులను వేదిస్తున్న ప్రశ్న ఇది. బార్ కాబట్టి కల్తీ చేసి అమ్మారా? మద్యం బాటిళ్లలోనే కల్తీ వచ్చిందా అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసులకు ప్రాథమికంగా వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే బార్‌లోనే కిక్ వచ్చేందుకు ఒక లిక్విడ్‌ను లిక్కర్‌లో కలిపారు. దీంతో తాగిన వారంతా తూలుతూ బార్‌లో కొందరు, రోడ్డుపై మరికొందరు, ఇంటికి వచ్చిన తరువాత ఇంకొందరు పడిపోయారు. నోటి నుంచి నురగలు, వాంతులు వచ్చాయి. దీనిని బట్టి తప్పకుండా బార్‌లోనే కిక్ ఇచ్చే మందు కలిపారనేది పోలీసుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది.
	 
	 బార్‌లో సాధారణ నీళ్లలో మందు కలుపుకుని తాగిన వారు పడిపోయారు. అలాగే ఫ్యూరిఫై చేసిన వాటర్ పాకెట్లు అక్కడే తీసుకొని తాగిన వారు కూడా పడిపోయారు. అంటే నీళ్లలో కల్తీ జరగలేదని స్పష్టమైంది. తప్పకుండా లిక్కర్‌లోనే కల్తీ ఉంటుందని భావిస్తున్నారు. అది ఎలా జరిగిందనేదే ప్రస్తుతం పోలీసులను, సిట్ ఉన్నతాధికారులను వేదిస్తున్న ప్రశ్న.  సిట్ బందానికి కేసు అప్పగించి రెండు నెలలు పూర్తయింది. ఈ బృందంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీ మహేష్‌చంద్ర లడ్హా బృందానికి సారథ్యం వహిస్తున్నారు. ఆయనకు కూడా ఈ కేసు అంతుబట్టడం లేదు.
	 
	 కిక్ కోసమే కల్తీ..
	 ఇక్కడ మద్యం తాగిన వారికి బాగా కిక్ రావాలి. తాగితే అక్కడే మందు తాగాలి అనే ప్రచారం రావాలని కొందరు బార్‌లోని వారు కల్తీ కలిపి ఉంటారని, అది ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి దాపురించిందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎందుకంటే బార్‌లో ఉద్యోగులు చూస్తుండగానే కొందరు పడిపోయారు. రోజు మాదిరిగానే పడిపోయి లేచి వెళతారనుకున్నారు కాని ఇలా జరుగుతుందనేది బార్ ఉద్యోగులు ఊహించలేదు. ఈ విషయం వారు పోలీసుల వద్ద అంగీకరించారు.
	 
	  సెంట్రల్ ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం..
	 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు పంపించిన పది రోజుల్లో వచ్చింది. సెంట్రల్ ఫోరెన్‌సిక్ లేబొరేటరీ నుంచి రావాల్సిన రిపోర్టు మాత్రం ఇంకా రాలేదు. దీని వెనుక కూడా మతలబు ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్టులో మద్యంలో కల్తీ లేదని వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు వస్తే కాని కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
