రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్థులు

Published Thu, Feb 2 2017 10:42 PM

రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్థులు

భోజనం విషయంలో వివాదం
- విద్యార్థులపై రౌడీలను ఉసిగొల్పిన వార్డెన్‌
- సస్పెండ్‌ చేయాలని కలెక్టరేట్‌ వద్ద ఆందోళన
- రాత్రి 10 గంటల వరకు ఉద్రిక్తత
 
కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): భోజనం విషయంలో తలెత్తిన వివాదం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని విద్యార్థులను వార్డెన్‌ కిరాయి రౌడీలతో చితకబాదించాడు. బాధిత విద్యార్థులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రజా సంఘాలతో కలిసి కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలివీ.. స్థానిక డాక్టర్స్‌ కాలనీ శివారులోని బీసీ కాలేజీ హాస్టల్‌లో సుమారు 300 మంది విద్యార్థులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భోజనంలో కొడిగుడ్డు వడ్డించే విషయంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థి రమేష్‌, డిగ్రీ విద్యార్థి గోపాల్‌ తదితరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే తన నిర్లక్ష్యం ఎక్కడ బయట పడుతుందోనని వార్డెన్‌ శ్రీనివాసరావు కిరాయి రౌడీలతో తమను చితకబాదించినట్లు విద్యార్థులు నాగరాజుగౌడ్‌, గోపాల్‌, నరేష్‌బాబు, జయచంద్ర, నాగార్జున తదితరులు వాపోయారు. వార్డెన్‌ తన సమీప బంధువైన విద్యార్థిని మెస్‌ ఇన్‌చార్జిగా నియమించి అక్రమాలకు పాల్పడుతున్నాడని.. ఇదేమని నిలదీయడంతోనే ఇలా చేశారన్నారు.
 
కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత
తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్‌కు తెలిపేందుకు బాధిత విద్యార్థులతో పాటు వసతి గృహ విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. కిరాయిరౌడీలను ఉసిగొల్పి హాస్టళ్లలో గ్యాంగ్‌వార్‌లకు ఊతమిస్తున్న వార్డెన్‌ను 
 సస్పెండ్‌ చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంఘం నాయకులు లక్ష్మినరసింహ ఆధ్వర్యంలో హాస్టల్‌ విద్యార్థులు వార్డెన్‌కు, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
వార్డెన్‌కు బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఘటనతో రాత్రి 10గంటల వరకు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో సీఐ మధుసూదన్‌, బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
 

Advertisement
Advertisement