‘శ్రీరామిరెడ్డి’కీ గడ్డుకాలం | sriramireddy driniking water scheme details | Sakshi
Sakshi News home page

‘శ్రీరామిరెడ్డి’కీ గడ్డుకాలం

Sep 11 2016 11:41 PM | Updated on Sep 4 2017 1:06 PM

జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంకూ గడ్డకాలం సమీపించింది.

– పేరుకుపోయిన యుటిలైజేషన్‌ చార్జీల బకాయిలు
– రూ.10.69 కోట్లు చెల్లించడంలో మున్సిపాలిటీల నిర్లక్ష్యంæ
– నోటీసులు జారీ చేసినా ఫలితం సున్నా
– కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బకాయిలు చెల్లించలేకపోతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ


జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంకూ గడ్డకాలం సమీపించింది. పథకం నిర్వహణకు సంబంధించి యుటిలైజేషన్‌ చార్జీలను చెల్లించడంలో మున్సిపాలిటీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్వహణ భారం పెరిగిపోయింది. రూ.10.69 కోట్ల మేర బకాయిలు వసూలు కాకపోవడంతో కార్మికులకు వేతనాలు, విద్యుత్‌ బకాయిలు చెల్లించలేక గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) చేతులెత్తేస్తోంది.

జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ, పారిశ్రామిక వాడ, మడకశిర, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తాగునీరు సరఫరా అవుతున్న ఈ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు యుటిలైజేషన్‌ చార్జీలను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు విధిగా చెల్లించాల్సి ఉంటుంది.  ప్రతి ఏటా వీరు చెల్లించే సొమ్ముతోనే ఈ పథకం నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ సొమ్ముతోనే విద్యుత్‌ బిల్లులు, కార్మికుల వేతనాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ చెల్లిస్తోంది.

పేరుకుపోయిన రూ. కోట్ల బకాయిలు
ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న మున్సిపాలిటీలు యుటిలైజేషన్‌ చార్జిలను సక్రమంగా చెల్లించడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హిందూపురం మున్సిపాలిటీ రూ. 10 కోట్లు, ఇదే ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వాడ రూ. 9 లక్షలు, మడకశిర మున్సిపాలిటీ రూ. 27 లక్షలు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూ. 33 లక్షలు మేర యుటిలైజేషన్‌ చార్జీలు బకాయిలు ఉన్నట్లు అధికారిక సమాచారం. దీంతో బకాయిలను వెంటనే చెల్లించాలని లేకుంటా పథకం నిర్వహణ భారమవుతుందంటూ ఆయా మున్సిపాలిటీల అధికారులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా మున్సిపల్‌ అధికారులు స్పందించకపోవడంతో అయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి ఇక్కట్లు మొదలు కానున్నాయి.  

గతంలో తాగునీటి సరఫరా నిలిపివేత
గతంలో కూడా ఈ మున్సిపాలిటీలు యుటిలైజేషన్‌ చార్జీలను చెల్లించకపోవడంతో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దాదాపు నెల రోజులపాటు తాగునీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఆ సమయంలో కలెక్టర్‌ కోన శశిధర్‌ జోక్యం చేసుకుని నీటి సరఫరాను పురుద్ధరించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గౌరవించారు. అయినా మున్సిపాలిటీ అధికారుల్లో మార్పు రాలేదు. తాగునీటి వినియోగానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల నుంచి పన్ను రూపేణ సొమ్ము వసూలు చేస్తున్న అధికారులు వాటిని తాగునీటి పథకం నిర్వహణకు వినియోగించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బకాయిలు పేరుకుపోవడంతో ఏ క్షణంలోనైనా తాగునీటి సరఫరాను  నిలిపివేసే అవకాశం లేకపోలేదు.

బకాయిలను వెంటనే చెల్లించాలి
శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం యుటిలైజేషన్‌ చార్జీలను మున్సిపాలిటీలు వెంటనే చెల్లించాలి. లేకపోతే  తాగునీటి సరఫరాను నిలిపివేస్తాం. గతంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాం. అయినా మున్సిపాలిటీలు బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ని«ధులున్నా బకాయిలను చెల్లించడం లేదు. దీంతో ఈ పథకం నిర్వహణ కష్టమవుతోంది. వెంటనే రూ.10.69కోట్ల బకాయిలను ఆయా మున్సిపాలిటీలు చెల్లించి సహకరించాలి.
– లోక్‌నాథ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement