రేపటి నుంచి ప్రత్యేక ఓటరు నమోదు
జిల్లాలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
– 18 ఏళ్లు నిండిన వారందరికీ అవకాశం
– జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,541 పోలింగ్‌కేంద్రాలకు బీఎల్‌ఓలను నియమించారు. వీరి దగ్గర అసవరమైన దరఖాస్తులు ఉంటాయి. జిల్లాలో 18– 21 ఏళ్ల యువత 1.98 లక్షల మంది ఉంది. ఇందులో 1.5 శాతం మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారు. మిగతా వారందరూ ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొని ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 18–21 ఏళ్ల యువత, వికలాంగులు, సర్వీస్ మెన్, ప్రవాస భారతీయులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రాధానన్యం ఇస్తారు. ప్రతి నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్‌లను ఓటరు నమోదు అధికారి (ఈఆర్‌ఓ)గా నియమించారు.
ఏ దరఖాస్తు ఎందుకు...
ఫారం–6: ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు
ఫారం–6ఎ: విదేశాల్లో నివాసం ఉంటూ విదేశీ పౌరసత్వం పొందని భారతీయ పౌరులు వారి నివాస ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయ్యేందుకు
ఫారం–7: జాబితాలో ఉన్న పేరుపై అభ్యంతరం తెలుపుతూ... తొలగించాలని కోరేందుకు
ఫారం–8: జాబితాలో ఉన్న వివరాలు, పేరు, చిరునామా, వయస్సు, తదితర వాటిని సవరించుకునేందకు
ఫారం–8ఎ: నియోజకవర్గం పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరోపోలింగ్ కేంద్రానికి మారడానికి
ఓటరుగా నమోదు అయ్యేందుకు ఈ–రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. నేరుగా ceoandhra.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత బీఎల్‌ఓలకు ఇవ్వవచ్చు. జూలై 9, జూలై 23 తేదీలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ప్రకటించారు.