కాల'భయ'రవులు

కాల'భయ'రవులు - Sakshi

 స్వైరవిహారం చేస్తున్న వీధికుక్కలు

నానాటికీ పెరుగుతున్న కుక్కకాటుల బాధితులు

ఈ ఏడాది రేబీస్‌తో 8 మంది మృతి

అతీగతీలేని సంతాన నియంత్రణ ఆపరేషన్లు

 

విశ్వాసానికి ప్రతిరూపమది. కష్టాల్లో ఉంటే ప్రాణం ఇవ్వడానికి సైతం వెనుకాడదు. ఇలాంటి జంతువే ఇప్పుడు జిల్లా ప్రజానీకానికి ప్రాణాంతకంగా పరిణమించింది. ఈ ఏడాది ఇప్పటికే 8 మందిని పొట్టనబెట్టుకున్న కుక్కలు.. చిన్నారులు, వృద్ధులపైనా విరుచుకుపడుతున్నాయి.

- కాకినాడ క్రైం

 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కుక్కల సంతతి గణనీయంగా పెరిగిపోతోంది. చిన్నా,పెద్దా, వృద్ధులనే తేడా లేకుండా.. సైకిల్, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారి వెంటపడి మరీ కరుస్తున్నాయి. కుక్కల సంతతిని నియంత్రించేందుకు అధికారులు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేపట్టకపోవడంతో çసమస్య తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా ఏటా కుక్కకాటు బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

సాధారణంగా వేసవిలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కుక్కకాటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వేసవిలో అనారోగ్యాలకు గురైన కుక్కలు.. కంటపడిన వారిపై దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం వీధికుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కుక్కలకాటు బాధితులు రోజుకు 20 నుంచి 25 మంది వరకు వచ్చి ఏఆర్వీ ఇంజెక‌్షన్‌ చేయించుకుంటున్నారు. కుక్కకాటు వల్ల రేబీస్‌ వ్యాధి సోకి జిల్లాలో జనవరి నుంచి నవంబర్‌ వరకూ 8 మంది మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. జిల్లాలో వందల సంఖ్యలో కుక్కకాట్లకు గురవుతున్నా అధికారులు కుక్కల సంతతి నియంత్రణకు శస్త్రచికిత్సలు చేయించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకూ 4,519 మంది బాధితులు

జిల్లాలో వీధికుక్కల దాడిలో జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకూ 8 మంది చనిపోయారు. ఇంకా 4,519 మంది గాయపడ్డారు. వీరికి 24,743 ఏంటీ రేబీస్‌ వేక్సిన్‌ (ఏఆర్‌వీ) వేశారు. గతంలో వీధికుక్కల సంతతి నియంత్రణకు పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఏడాదికోసారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. మూగజీవుల నియంత్రణకు చర్యలు చేపట్టరాదనే జంతుహింస నివారణ చట్టం ఫలితంగా వారి చర్యలకు విఘాతం ఏర్పడింది. కనీసం వీధికుక్కలు వృద్ధి చెందకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టాల్సి ఉండగా, ఇది ఖర్చుతో కూడు కున్నది కావడంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు అటకెక్కించారు.

విరుచుకుపడుతున్న శునకాలు

జిల్లావ్యాప్తంగా కుక్కలు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయి. అక్టోబర్‌లో కాకినాడ రామకృష్ణారావుపేటలో నలుగురు, మహాలక్ష్మినగర్‌లో ముగ్గురు, రేచర్లపేట, సూర్యనారాయణపురం, జగన్నాథపురం ప్రాంతాల్లో తలో ముగ్గురు చిన్నారులను వీధికుక్కలు గాయపరిచాయి. ఇటీవల సామర్లకోట మండలం జి.మేడపాడులో వీధికుక్కల దాడిలో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. ఆదివారం కోరుకొండలో ఇళ్లవద్ద ఉన్న ఇద్దరు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడలో 24 గంటల సేవలు

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కుక్కకాటు బాధితుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రత్యేక ఇంజెక‌్షన్‌ గదిలో ఏఆర్‌వీ డోసు ఇస్తారు. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 8 వరకూ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ విభాగంలో ఏఆర్వీ ఇంజెక‌్షన్‌ డోస్‌ వేస్తున్నారు. కుక్క, పిల్లి, కోతి కాట్లను  బట్టి ఒక్కో బాధితుడికి 4 నుంచి 5 డోసుల ఏఆర్వీ ఇస్తున్నట్టు నర్సుల విభాగ ఇన్‌చార్జి, స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.ఆనీ తెలిపారు. సాధారణంగా 4 డోసులు ఇస్తామని, వీటిని 3 రోజులు 7,21,30 రోజుల వ్యవధిలో బాధితునికి అందిస్తున్నట్టు తెలిపారు.

అందుబాటులో ఏఆర్వీ

జిల్లాలోని ప్రజల అవసరాలకు సరిపడా ఏంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఆస్పత్రులకు సరఫరా చేసిన తర్వాత ఇంకా 10 వేల వేల్స్‌ ఏఆర్‌వీ సిద్ధంగా ఉంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వాస్పత్రుల డిమాండ్‌ మేరకు ఆన్‌లైన్‌లో పెట్టిన ఇండెంట్‌పై కాకినాడ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి సరఫరా చేస్తున్నాం.

- ఎస్‌.నాగేశ్వరరావు, ఫార్మాసిస్ట్, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్, కాకినాడ
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top