
వైఎస్‌ఆర్‌సీపీ గెలుపే లక్ష్యం
పలమనేరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపే తన లక్ష్యమని ఆ పార్టీలో చేరిన పెద్దపంజాణి మాజీ ఎంపీపీ
పలమనేరు అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపే తన లక్ష్యమని ఆ పార్టీలో చేరిన పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి సృష్టంచేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరాక తొలిసారిగా పలమనేరుకు విచ్చేసిన విజయభాస్కర్‌రెడ్డికి స్థానిక కోఆర్డినేటర్లతో కలసి పార్టీ నాయకులు, ఆయన అభిమానులు, కార్యకర్తలు బుధవారం పట్టణంలో భారీ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘జగన్ నాయకత్వం వర్థిల్లాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలి’ అనే నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్ కమిటీ ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించారు.
ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పలమనేరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా వారి గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నాటి వైఎస్ సంక్షేమపాలన రావాలంటే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ గెలుపును తన భుజాలపై వేసుకుంటానన్నారు.
స్థానిక కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులకు ఎన్నటికీ రుణపడి ఉంటానన్నారు. పెద్దపంజాణి మండలంలో పార్టీ కేడర్‌ను మరింత బలోపేతం చేసి నియోజకవర్గంలోనే తన మండలాన్ని వైఎస్‌ఆర్‌సీపీకి కంచుకోటలా తయారుచేస్తామన్నారు. అనంతరం కోఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్ మాట్లాడుతూ విజయభాస్కర్ రెడ్డి పార్టీలో చేరికతో తమకు రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి వెంకటేష్‌గౌడ, జిల్లా కార్యదర్శి చెంగారెడ్డి, పలమనే రు, బైరెడ్డిపల్లె, గంగవరం మండల కన్వీనర్లు బాలాజీ నాయుడు, కేశవులు, మోహన్‌రెడ్డి, బాగారెడ్డి తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గ నేతలంతా కలసి విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.