సోలార్ కారు.. హాయిగా షికారు
కర్నూలు నగర శివారులోని వెంకయ్యపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థు«లు తమ ప్రతిభతో సోలార్ కారును ఆవిష్కరించారు.
- జి.పుల్లయ్య కాలేజీ విద్యార్థుల ఆవిష్కరణ
- త్వరలోనే వికలాంగులకు సైతం సోలార్ ట్రైసైకిళ్ల తయారీకి చర్యలు
- విద్యార్థులను అభినందించిన కాలేజీ చైర్మన్ జి.వి.ఎం మోహన్ కుమార్
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని వెంకయ్యపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థు«లు తమ ప్రతిభతో సోలార్ కారును ఆవిష్కరించారు. అలాగే ఇంట్లో పైసా ఖర్చూ లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసుకునేందుకు సోలార్ కుక్కర్‌ను సైతం తయారు చేశారు. ఈ మేరకు బుధవారం ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల చైర్మన్ జి.వి.ఎం మోహన్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కాలుష్యం సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. దీంతో తమ వంతుగా సమాజానికి మెరుగైన వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతోనే సోలార్‌తో రెండు ప్రాజెక్టులను ఈ ఏడాది తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇందులో భాగంగానే విద్యార్థు«లు చాలా శ్రమతో అధ్యాపకుల సహయంతో సోలార్ కారు, సోలార్ కుక్కర్‌ను రూపొందించారన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇది ప్రారంభమని, మునుముందు ఎన్నో ప్రాజెక్టులు చేపడుతామన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. సమావేశంలో ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, వైస్ చైర్మెన్ జి.వంశీధర్, డీన్ డా.ఎస్ ప్రేమ్‌కుమార్, కార్పొరేట్ వ్యవహారాల డీన్ డా.ఎం.గిరిధర్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
తక్కువ ఖర్చుతోనే కారు: చైర్మన్ జి.వి.ఎం మోహన్‌కుమార్
కాలుష్య నివారణకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సోలార్ కారును ఆవిష్కరించాలనుకున్నాం. రూ. 1.25 లక్షల బడ్జెట్‌ను నిర్ణయించాం. అయితే మెకానికల్ తృతీయ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు జె.నిర్మల్, డి.ఆశిష్, హూసేన్ బాషా, సాయినాథ్‌గౌడ్, రంజిత్, యోగేష్, అనిల్ దాదాపు 45 రోజులపాటు స్టడీ చేసి మోకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె. మల్లికార్జున పర్యవేక్షణలో కేవలం రూ. 70 వేలు మాత్రమే ఖర్చు చేసి సోలార్ కారును తయారు చేశారు. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. 2 నుంచి 3 గంటలు చార్జీ అయితే సరిపోతుంది. గంటకు 32 నుంచి 40 కి.మీ వేగంతో వెళ్తుతుంది. సాధారణ వాహనాల వలే రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు. సోలార్ ఫలకాలను పెంచుకుంటే మరింత వేగంగా కూడా వెళ్లవచ్చు. ప్రస్తుతం నాలుగు బ్యాటరీలతో కారు నడుస్తుంది. క్యాంపస్‌లో దీన్ని వినియోగిస్తున్నాం. త్వరలోనే దివ్యాంగుల కోసం సోలార్ ట్రైసైకిళ్ల తయారు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం.