సర్కారు బడిలో ‘స్మార్ట్‌’ బోధన..!

సర్కారు బడిలో ‘స్మార్ట్‌’ బోధన..! - Sakshi


సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్కూళ్లకు ‘డిజిటల్‌’ హంగులు రానున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల రూపు రేఖలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చిన్న ప్రైవేటు స్కూలు నుంచి కార్పొరేట్‌ స్థాయి విద్యాసంస్థ వరకు అన్నీ ‘స్మార్ట్‌’గా మారిపోయాయి. ప్రైవేటుకు దీటుగా.. సర్కారు బడులను సైతం బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని సర్కారు ఉన్నత పాఠశాలల్లో ‘స్మార్ట్‌ క్లాస్‌’ రూంలు ఏర్పాటు చేయనుంది.


ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్‌ 2 నుంచి అన్ని బడుల్లోని విద్యార్థులు డిజిటల్‌ పాఠం వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో ప్రైవేటు స్కూళ్లలో బ్లాక్‌ బోర్డ్, చాక్‌పీస్‌లు, చార్ట్‌లు అవసరం లేకుండా పూర్తిగా ప్రొజెక్టర్‌ని వినియోగిస్తున్నారు. నర్సిరీ నుంచే స్మార్ట్‌ విధానంలో అక్షర జ్ఞానాన్ని ఒంటబట్టిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు బడులకూ డిజిటల్‌ విధానాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చర్యలు ప్రారంభించారు.182 బడుల్లో అమలు..

జిల్లాలో ఉన్న 182 ఉన్నత పాఠశాలల్లో దాదాపు 60 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వచ్చే నెల 2వ తేదీ నుంచి డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి స్కూల్‌కు కంప్యూటర్, ప్రొజెక్టర్, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు అందించనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష వరకు ఖర్చు చేయనున్నారు.


దీనికి సంబంధించి డీఈఓ సోమిరెడ్డి చేసిన ప్రతిపాదనలపై కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో గడువులోగా ప్రతి పాఠశాలలో డిజిటల్‌ విధానంలో బోధించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే డిజిటల్‌ విధానంపై రాష్ట్రస్థాయిలో రిసోర్స్‌ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న రిసోర్స్‌ పర్సన్లు జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా తర్ఫీదు ఇవ్వనున్నారు.

డిజిటల్‌ విధానం ఎందుకు..!

సంప్రదాయ బోధనా పద్ధతుల ద్వారా ఆశించిన స్థాయిలో విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించలేక పోతున్నారు. మూస పద్ధతిలో చదవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చదివిన అంశాలను సైతం గుర్తుపెట్టుకోలేక పోతున్నారు. చార్ట్‌లు, బొమ్మలు, స్పెసిమన్స్ వంటి ఉపకరణాలను ఉపయోగించినా సత్ఫలితాలు అంతగా లేవు. ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లోకి వచ్చాక విద్యార్థులు మరింత సృజనాత్మకంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది.


ప్రతి అంశాన్ని విద్యార్థే స్వతహాగా ఆలోచించి అక్షరీకరించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో డిజిటల్‌ పాఠం ఆవశ్యకత రెట్టింపైందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కళ్లకు కట్టినట్టుగా విద్యార్థులకు చూపిస్తే.. అంత సులువుగా మరచిపోలేరు. దీన్ని గుర్తించిన అధికారులు.. తరగతి బోధనపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సబ్జెక్టుల పాఠ్యాంశాలకు డిజిటల్‌ రూపమిచ్చి విద్యార్థుల ముంగిటకు తేనున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top