అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నరథోత్సవం వైభవంగా జరిగింది.
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చిన్న రథోత్సవంలో కూర్చోబెట్టి హంపణ్ణస్వామి గుడి వరకు స్వామివారి నామస్మరణలతో భక్తులు ముందుకు లాగారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాలపల్లకీలో స్వామివారిని గ్రామంలోని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. సర్పంచ్ సదాశివ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంటకస్వామి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు బ్రహ్మరథోత్సవం
సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.