అంతా అనధికారమే.. | Sand mining | Sakshi
Sakshi News home page

అంతా అనధికారమే..

Jan 9 2017 11:13 PM | Updated on Aug 28 2018 8:41 PM

అంతా అనధికారమే.. - Sakshi

అంతా అనధికారమే..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10, 11 ప్యాకేజీ పనుల కోసం ప్రభుత్వ ఆదేశాలతో నీటిపారుదలశాఖకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచ సమీపంలోని

ప్రాజెక్టుల పేర ఇసుక అక్రమ తవ్వకం
అధికారుల పర్యవేక్షణ కరువు
లారీల కెపాసిటీ మించి ఇసుక తరలింపు


సిరిసిల్ల రూరల్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10, 11 ప్యాకేజీ పనుల కోసం ప్రభుత్వ ఆదేశాలతో నీటిపారుదలశాఖకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచ సమీపంలోని మధ్యమానేరులో జీవోఎస్‌ నెం.54ను అనుసరించి ఇసుక రీచ్‌కు భూగర్భజలవనరుల శాఖ అనుమతినిచ్చింది. సూమారు కోటి 30వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తొమ్మిది కిలోమీటర్ల మేర తవ్వకాలు జరపవచ్చని మైనింగ్‌ అధికారులు గుర్తించారు. ప్రాజెక్ట్‌ పనుల నిమిత్తం ప్రభుత్వ పనులుగా గుర్తించి కారుచౌకగా రూ.40 రూపాయలకే ఒక్క క్యూబిక్‌ మీటర్‌ చొప్పున సరఫరా చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు. నిబంధన ప్రకారం ప్రతి లారీ తూకం వేసి, ఓవర్‌లోడ్‌ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. ఓవర్‌లోడ్‌పై రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేయాలి.

అక్రమాలు చోటు చేసుకోకుండా జీయో ట్యాగ్‌ను ప్రతీలారీకి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే తవ్వకాలు జరపాలని పేర్కొంటూ మైనింగ్‌ ఏడీ కిరణ్‌ కుమార్‌ గత ఏడాది డిసెంబర్‌ 23న చీర్లవంచ ఇసుక రీచ్‌కు అనుమతి ఇచ్చారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగడం లేదు. ప్రాజెక్ట్‌ల పేరిట ఇరిగేషన్  శాఖ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు కుమ్మక్కై కొంత మంది అధికార పార్టీ పెద్దలతో కలసి అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

ప్రాజెక్ట్‌ల పేరిట ఇసుక అక్రమ రవాణా
తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం పేరిట ప్రభుత్వం నుంచి ఇసుక రీచ్‌కు అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇరిగేషన్  శాఖ పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇసుకను తరలిస్తున్నారు. సంబంధిత మైనింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విశేషం. సిద్దిపేట ఇరిగేషన్ శాఖ అధికారులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10,11 ప్యాకేజీల కాంట్రాక్టర్లు కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా చీర్లవంచ ఇసుక రీచ్‌ను నుంచి రోజుకు 300 లారీల వరకు ఇసుకను జీయో ట్యాగ్‌ అమర్చిన లారీల ద్వారా తరలిస్తున్నారు. పది టైర్లు ఉన్న లారీలో 17 టన్నులు, పన్నెండు టైర్లు ఉన్న లారీలో 31 టన్నుల ఇసుక మాత్రమే తీసుకెళ్లాలి. కానీ ఒక్క లారీలో 12 టన్నుల నుంచి 15 టన్నుల ఇసుక అధికంగా తీసుకెళ్తు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ ఓవర్‌లోడ్‌ ఇసుకంత ఎక్కడికి వెళ్తుందో అంతుచిక్కడం లేదు. శనివారం జిల్లా మైనింగ్‌ ఏడీ కిరణ్‌ కుమార్‌ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.

రెండు ఇసుక లారీలను పట్టుకొని సారంపల్లి వేబ్రిడ్జి వద్ద తూకం వేయించగా ఓ లారీలో 43 టన్నులకు పైగా, మరో లారీలో 31 టన్నుల ఇసుక లోడ్‌ చేసుకుపోతున్నట్లు వెల్లడైంది.దీంతో రెండు లారీలను సీజ్‌ చేసి తంగళ్లపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసులు నమోదు చేశారు. ఇలా రోజుకు 300 లారీలలో సూమారుగా పది టన్నుల చొప్పున ఓవర్‌లోడ్‌తో ఇసుక అక్రమ రవాణా చేసిన 3000 టన్నుల ఇసుక సిద్దిపేట జిల్లాకు తరలిపోతుంది. రోజుకు రూ.4.80 లక్షల విలువైన ఇసుక అక్రమ మార్గంలో బ్లాక్‌ మార్కెంట్‌లోకి తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నరన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుతగిలితే..సస్పెన్షనా..బదిలీయా ఖాయం అని ప్రభుత్వ అధికారుల్లో చర్చ జరుగుతుంది.

శనివారం రెండు ఇసుక ఓవర్‌లోడ్‌ లారీలను మైనింగ్‌ ఏడి కిరణ్‌కుమార్‌ పట్టుకొని కేసులు నమోదు చేయడంతో అధికారపార్టీ పెద్దలు కొంత మంది ఫోన్లో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.  ఇప్పటికైనా ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణాను చేయకుండా చర్యలు తీసుకోవాలని, లారీల కేపాసిటీ మేరకే ఇసుక అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతీ లారీ నిబంధన ప్రకారం వేబ్రిడ్జి వద్ద తూకం వేసి.వేబిల్లుతో జిల్లా సరిహద్దులు దాటేలా చూడాల్సిన అవసరం  అవసరం సర్కారుపై ఉంది.


బ్యానర్‌ కనిపిస్తే నో చెకింగ్‌
చీర్లవంచ రీచ్‌ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పనులకు ఇసుక సరఫరా అని బ్యానర్‌ కనిపిస్తే చాలు రవాణశాఖ అధికారులు గానీ, పోలీసులు గానీ, మైనింగ్‌ అధికారులు గానీ తనిఖీలు చేయడం లేదు. జిల్లెల్ల చెక్‌పోస్టులో ఈ లారీలను అసలే ఆపరు. పేరుకు సీసీ కెమెరాలు పెట్టినా ఒక్కరోజు కూడా ఈ సీసీ కెమెరాలో రికార్డయిన ఓవర్‌లోడ్‌ లారీల వివరాలు సేకరించిన దాఖాలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement