గూడెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైతు బజార్‌ | RYTHU BAZAR IN INTERNATIONAL STANDARDS AT GUDEM | Sakshi
Sakshi News home page

గూడెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైతు బజార్‌

May 10 2017 10:46 PM | Updated on Sep 5 2017 10:51 AM

తాడేపల్లిగూడెంలో రూ.2.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైతుబజార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు...

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తాడేపల్లిగూడెంలో రూ.2.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైతుబజార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ కె.భాస్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రాధాన్యతా రంగాల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తాడేపల్లిగూడెంతో పాటు 45 మండలాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో భారీ కోల్డ్‌ స్టోరేజీ యూనిట్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో హోల్‌సేల్‌ రైతు బజార్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆరు నెలల్లో ఈ ఆధునిక రైతు బజారును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన తోటల పెంపకం, పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. ప్రతి రైతు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే 20 శాతం అదనపు ఆదాయం అర్జించుకోగలుగుతాడని అన్నారు. యంత్ర సాయంతో పంట ఉత్పత్తులను కటింగ్‌ చేస్తే పాడవకుండా తాజాదనంతో ఉంటాయన్నారు. అపరాల సాగు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సబ్సిడీ సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
 
పాలసేకరణలో ముందంజ వేయాలి
ప్రైవేటు డెయిరీలకు దీటుగా పాలసేకరణ ధరను పెంచామని, ఇటువంటిస్థితిలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాలసేకరణ ముమ్మరం కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం లక్ష లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేశామని, మరో లక్ష లీటర్ల సామర్థ్యం గల శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటులో ఉన్నామని తెలిపారు. పశుగ్రాసం కొరత లేకుండా పశువులకు అవసరమైన గడ్డిని పెంచేందుకు 5 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజేసీ ఎంహెచ్‌ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ ఏడీ విజయలక్ష్మి, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement