రైతు బజార్‌లో తక్కువ ధరకు వంట నూనెల విక్రయాలు

Sale Of Cooking Oils At Low Prices At Rythu Bazar In AP - Sakshi

కడప అగ్రికల్చర్‌: రాష్ట్రవ్యాప్తంగా వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సామాన్యుడు కనీవిని ఎరుగని రీతిలో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో  సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు కొని తినలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని రైతు బజార్‌ల ద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు బ్రాండెడ్‌ ఆయిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విజయ్‌ బ్రాండ్‌కు చెందిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్, వేరుశనగ నూనె, పామాయిల్, రైస్‌ బ్రాండ్‌ ఆయిల్‌ను విక్రయించేందుకు సిద్ధం చేసి ధరలను కూడా ఖరారు చేశారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతు బజార్‌లో ఉన్న అన్ని కిరాణా షాపుల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. రైతు బజార్‌కు సంబంధించిన కొంతమంది సిబ్బంది ద్వారా కూడా వీటిని విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు.   

ఇప్పటికే టమాటాలను..  
ఇటీవల బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటాల ధర రూ. 100 నుంచి 120 దాకా పలికింది. ఈ తరుణంలో ప్రజల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కర్నాటక నుంచి దిగుమతి చేసుకుని రైతు బజార్‌ ద్వారా కిలో రూ. 65తో విక్రయించింది. ప్రస్తుతం రూ.52తో విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

తక్కువ ధరలకు విజయ్‌ బ్రాండ్‌ ఆయిల్‌ 
బహిరంగ మార్కెట్‌లో ఆయిల్‌ ధరలు బాగా పెరిగాయి. దీంతో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజారులో విజయ్‌ బ్రాండ్‌కు సంబంధించిన ఆయిల్‌ ఉత్పత్తులను తీసుకొస్తోంది. ధరలు కూడా బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువగా ఉండనున్నాయి. ఈ నూనెలు రెండు మూడు రోజుల్లో రైతుబజార్‌కు వస్తాయి.     
– హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ, కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top