ఆర్‌వోబీ.. నత్తనడక | ROB.. slow | Sakshi
Sakshi News home page

ఆర్‌వోబీ.. నత్తనడక

Sep 26 2016 8:45 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఆర్‌వోబీ.. నత్తనడక - Sakshi

ఆర్‌వోబీ.. నత్తనడక

పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తున్న పాలకులు, అధికారులు వాటి పురోగతి గురించి పట్టించుకోకపోవడంతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి.

* రూ.50 లక్షలతో ఆర్‌వోబీ సుందరీకరణ 
నెమ్మదిగా సాగుతున్న పనులు
 
పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తున్న పాలకులు, అధికారులు వాటి పురోగతి గురించి పట్టించుకోకపోవడంతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సమయం గడచినా పనులు పూర్తికావట్లేదు. ఇందుకు తెనాలి పట్టణంలోని ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిదర్శనం. 
 
తెనాలి రూరల్‌ : తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో పట్టణ నడిబొడ్డులో ఉన్న ఈ వంతెన నిత్యం రద్దీగానే ఉంటుంది. 1960 దశకాల్లో ఈ వంతెనను నిర్మించారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రైలు పట్టాల పైన రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కింది భాగం పెచ్చులూడి పడుతోంది. పట్టణంలో అతి పెద్దదయిన ఈ వంతెనకు పైపై మెరుగులు దిద్ది సుందరీకరించాలని పాలకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆర్‌అండ్‌బీ అధికారులు సుమారు రూ.50 లక్షల అంచనాలు సిద్ధం చేశారు. గోప్యంగానే అయిన వారికి కాంట్రాక్టు ఇప్పించేశారు. ఇంకేముంది పుష్కరాల సందర్భంగా పట్టణాన్ని సుందరీకరిస్తున్నారంటూ ప్రచారమూ సాగింది. ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. పనులను ఆర్భాటంగా ప్రారంభించి, ప్రచారం చేయించుకున్న వారు అవి కొనసాగుతున్న తీరును పర్యవేక్షించడం మరచారు. పనులు ప్రారంభించి రెండు నెలలు దాటినా, ఇప్పటికీ సగం పనులు జరగలేదంటే అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేసిన పనులూ అంత నాణ్యంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న గోడలను పగులగొట్టి, వాటి స్థానే ఇనుప గొట్టాలు ఏర్పాటు చేసి, పసుపు, కాషాయ రంగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంత మేర వేసిన రంగులు నాలుగు రోజులకే లేచి పోతున్నాయి. ఇక ఫుట్‌పాత్‌పై టైల్స్‌ కూడా లేచి పోతున్నాయి. అధికారులు పనులను పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement