
ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమం
భూసమీకరణకు ఒక్క ఎకరం కూడా రైతులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, వారికి తాము అండగా ఉంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.
మచిలీపట్నం : భూసమీకరణకు ఒక్క ఎకరం కూడా రైతులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, వారికి తాము అండగా ఉంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు. మచిలీపట్నం మండలంలో భూసమీకరణకు వ్యతిరేకంగా భూ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో పాల్గొన్న మధు మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు రోజున ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. రైతులపై లాఠీచార్జ్ చేసినా, కాల్పులు జరిపినా వెనుకంజ వేసేది లేదన్నారు. రైతులపై దాడి చేస్తే ప్రభుత్వ దుర్మార్గం బయటపడుతుందని, అప్పుడైనా భూసమీకరణ నోటిఫికేషన్ రద్దు అవుతుందన్నారు. ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆయన ముక్కు నేలకు రాసేలా చేస్తామని హెచ్చరించారు. టీడీపీలోకి 20 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని, అయితే వారి వెంట ప్రజలు వెళ్లలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ అక్రమాలను వివరించేందుకే...
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు రైతులను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తారని, రైతులు బెదిరిపోవద్దన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వివరించేందుకే పాదయాత్రను చేపట్టినట్లు చెప్పారు. భూసమీకరణపై ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామన్నారు. గోకవరం నుంచి పాదయాత్ర ప్రారంభమై పాతరెడ్డిపాలెం, ఓడరేవుపాలెం, సిరివెళ్లపాలెం, మంగినపూడి, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతిరెడ్డిపాలెం, మేకవానిపాలెం, చినకరగ్రహారం, పెదకరగ్రహారం గ్రామం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ సీపీ, వామపక్షాల నాయకులు షేక్ సలార్‌దాదా, లంకే వెంకటేశ్వరరావు, కొడాలి శర్మ, మాదివాడ రాము, బొర్రా విఠల్, మారుమూడి విక్టర్‌ప్రసాద్, మోకా భాస్కరరావు, వాలిశెట్టి రవిశంకర్, అక్కినేని వనజ, కొల్లాటి శ్రీనివాసరావు, మోదుమూడి రామారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.