జలకళ సంతరించుకున్న నల్లవాగు ప్రాజెక్టు | rain water in nallavagu project | Sakshi
Sakshi News home page

జలకళ సంతరించుకున్న నల్లవాగు ప్రాజెక్టు

Jul 27 2016 10:37 PM | Updated on Sep 4 2017 6:35 AM

నల్లవాగు ప్రాజెక్టు అలుగు

నల్లవాగు ప్రాజెక్టు అలుగు

జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతుల్లో ‘ఖరీఫ్‌’ ఆశలు మొలకెత్తాయి.

  • కార్యరూపం దాల్చని వృథా నీటి మళ్లింపు పనులు
  • శిథిలమైన కాల్వలు, తూములు
  • సాగుపై రైతుల్లో మోదం.. ఖేదం
  • కల్హేర్‌: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతుల్లో ‘ఖరీఫ్‌’ ఆశలు మొలకెత్తాయి. నల్లవాగు ఎగువ భాగంలోని కర్ణాటక రాష్ట్రం, కంగ్టి మండలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ఈక్రమంలో ఆలస్యంగా వర్షాలు పడడంతో ఖరీఫ్‌ సాగు కోసం రైతుల పరిస్థితి సందిగ్ధంలో ఉంది. మెజారిటీ శాతం రైతులు వరి సాగు కోసం సన్నద్ధంగా కాగా.. మరికొందరు ఇప్పటికే సోయాబీన్‌, పెసర తదితర పంటలు వేశారు. ప్రాజెక్టు కింద చాలామంది రైతులు సాగుకు దూరంగా ఉన్నారు.

    ఆలస్యమైన వర్షాలు
    ఆలస్యంగా పడిన వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. వరి సాగు చేయదలచినవారు సందిగ్ధంలో ఉన్నారు. పెసర పంట చేతకొచ్చాక వరి వేస్తామని కొందరు చెబుతున్నారు. మరో పక్క నల్లవాగు ప్రాజెక్టు కాల్వల దుస్థితి అధ్వానంగా మారింది.

    ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు సరఫరా జరిగేందుకు దెబ్బతిన్న కాల్వల మరమ్మతులు ముందస్తుగా చేయాల్సి ఉంది. ఇప్పటికే గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టు కాల్వలు దెబ్బతిన్నాయి. తూములు, సైఫాన్లు, షట్టర్లు పాడయ్యాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమర్జెన్సీ కెనాల్‌ పూర్తిగా ధ్వంసమైంది.

    దివంగత సీఎం వైఎస్‌ ఆధ్వర్యంలో...
    నల్లవాగు కాల్వలను ఆధునీకరణకు 2009–10లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19 కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్‌ కట్టడాలు బీటలువారాయి. కాల్వల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయకట్టు కింది రైతులు బోర్లు తవ్వుకుంటున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాల్వలను బాగు చేయాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

    ఇటీవలే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్‌ సాగు కోసం కాల్వలను తక్షణమే బాగుచేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

    పెరుగుతున్న నీటిమట్టం
    నల్లవాగు ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,488 ఫీట్లు ఉంది. సోమవారం కురిసిన వర్షంతో ఒక అడుగు నీరు చేరింది. నీటి నిల్వ 471.547 ఎంసీఎఫ్‌టీలు ఉందని ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్‌ తెలిపారు.

    453 క్యూసెక్‌ల వరద నీరు వచ్చిందని, మరో 5 అడుగులు చేరితే ప్రాజెక్టు నిండి అలుగుపై పొంగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్‌(కె) చెరువులు నిండుతాయి. వాగులు ప్రవహించడంతో బోరుబావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. తాగు, సాగు నీటి కష్టాలు దూరమవుతాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలని బీబీపేట, పోచాపూర్‌ గ్రామాల రైతులు నల్లవాగు వద్ద కట్ట మైసమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశారు.

    5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు
    కలే్హర్‌ మండలంలోని సుల్తానాబాద్‌ వద్ద 1967లో రూ.98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదలశాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్‌(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్‌ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది.

    ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్‌గాం, నిజామాబాద్‌ జిల్లా మార్దండ, తిమ్మనగర్‌ గ్రామాల్లో 1,230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల ఆధునీకరణ జరగడంతో ఇక కష్టాలు తీరినట్టే అని భావించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధునికీకరణ చేసి రెండేళ్లు గడిచాయో లేదో పాత పరిస్థితి తలెత్తింది. చివరి ఆయకట్టు పరిధిలోని మార్డి, ఇందిరానగర్, కల్హేర్‌ గ్రామల్లోS రైతుల కష్టాలు యథావిధిగానే ఉన్నాయి.

    పేరుకున్న పూడిక
    నల్లవాగు ప్రాజెక్టులో ఏటా పూడిక పేరుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నీటినిల్వ తగ్గుతోంది. పూడిక ఎంత మేరకు ఉందో గుర్తించేందుకు అధికారులు 5 ఏళ్ల క్రితం హైడ్రాలాజికల్‌ సర్వే జరిపినా పురోగతి లేదు. నల్లవాగు ప్రాజెక్టు నిండిన ప్రతిసారి అలుగుపై నుంచి నీరు పొర్లుతోంది. వృథానీటికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించారు.

    నల్లవాగు నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులో మళ్లించాలని అప్పట్లో అధికారులు  ప్రభుత్వానికి రూ.98 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వైఎస్‌ఆర్‌ ఆకస్మిక మరణంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. వృథా నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మళ్లిస్తే కలే్హర్‌ మండలంలోని చెరువులు, కుంటలు నిండి మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లోని అన్నదాతలకు లాభం చేకూరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement