అమీర్‌పేటలోగల గాంధీ నేచురోపతి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడ్డట్టు సమాచారం.
అమీర్‌పేట(హైదరాబాద్): అమీర్‌పేటలోగల గాంధీ నేచురోపతి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ సంఘటన గతనెల 29న జరుగగా మంగళవారం రాత్రి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న రాజు, సనీత్‌కుమార్, భానుతేజ, చందు అనే విద్యార్థులు హాస్టల్‌లో ఒకే రూంలో నివాసం ఉంటున్నారు. 29న రాత్రి వంట చేస్తున్న సమయంలో రాజు, సనీత్‌కుమార్‌ల మద్య గొడవ జరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
గొడవ జరిగిన సమయంలో ఓ వర్గానికి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కాగా, సనీత్‌కుమార్, భానుతేజ, చందులు తమపై దాడికి పాల్పడ్డారని రాజు తన అనుచరవర్గంతో కలిసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.అయితే అధికారులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగిందన్న విషయం విద్యార్థుల తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులను పిలిపించగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. కాగా, కళాశాలలో ర్యాగింగ్ జరుగలేదని, హాస్టల్ రూంమేట్స్ మధ్య చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందని నేచురోపతి కళాశాల ప్రిన్సిపాల్ నీరజారెడ్డి తెలిపారు.