తెగుళ్లతో చెరకు సాగు చేదే | Sakshi
Sakshi News home page

తెగుళ్లతో చెరకు సాగు చేదే

Published Sat, Aug 27 2016 9:03 PM

చెరకు పంటకు సోకిన వేరు పురుగు - Sakshi

 • మెలకువలు పాటిస్తేనే మేలు
 • చెరకు పంట ప్రధాన శాస్ర్తవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సలహాలు, సూచనలు
 • న్యాల్‌కల్‌: జిల్లాలో చెరకు ప్రధాన పంటగా సాగుచేస్తారు. సాగులో పంటకు తెల్లదోమ, పసుపు నల్లి, వేరు పురుగు తెగుళ్లు సోకుతుంటాయి. వీటివల్ల దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. తెగుళ్లు సోకే విధానం, నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బసంత్‌పూర్‌-మామిడ్గి శివారులో గల ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రం చెరకు పంట ప్రధాన శాస్ర్తవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సూచించారు. చెరకు సాగులో తీసుకోవాల్సిన  మెలకువలపై ఆయన సలహాలు, సూచనలు మీకోసం...

  తెల్లదోమ:
  ఇది ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీలుస్తుంది. ఫలితంగా పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడుసబారుతాయి. నీటి ముంపునకు గురైన ఎరువు వేయలేని పొలాల్లోనూ, కార్శి తోటల్లోనూ ఇది ఎక్కువగా వస్తుంది.

  నివారణ:
  దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల మలాథియాన్ లేదా 1.7 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్‌ లేదా 1.7మిల్లీ లీటర్ల డైమితోయెట్‌ అనే మందును లీటర్‌ నీటిలో కలిపి మొక్కల ఆకుల కింది భాగంలో పిచికారీ చేసుకోవాలి. అయితే 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండు సార్లు ఆకుల కింది భాగంలో తడిసే పిచికారీ చేసుకోవాలి.

  పసుపునల్లి:
  ఈ నల్లులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరుతాయి. 6 నుంచి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈనెకు సమాంతరంగా గూళ్లను ఏర్పాటు చేసుకొని వాటిలోపల నివసిస్తాయి. ఇవి ఆకుల అడుగు భాగాన్ని గీకి, రసం పీల్చడం వల్ల ఆకుపచ్చని అండాకారం మచ్చలు ఏర్పడతాయి. క్రమేసి ఇవి ఎరుపు రంగుగా మారుతాయి.

  ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి చెరకు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల అవి క్రమంగా వాడిపోయి ఎండిపోతాయి. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి. దీని ఉధృతి ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఉంటుంది. గాలిలో తేమ 60 నుంచి 75 శాతం ఉన్నప్పుడు కూడా దీని ఉధృతి ఎక్కువ.

  నివారణ:
  నల్లి ఆశించిన కింది ఆకులను తీసేసి తగుల బెట్టాలి. నీటిలో కరిగే గంధపు పొడి లీటర్ నీటికి 3 గ్రాములు లేదా 3 మిల్లీ లీటర్ల ప్రొపెనోఫాస్‌ 3 మిల్లీ లీటర్ల ఉమైట్ అనే మందును కలిపి ఆకుల అడుగుభాగం తడిసేలా పిచికారీ చేయాలి. అవరాన్ని బట్టి మరో 15 రోజుల్లో మళ్లీ పిచికారీ చేయాలి. దీని ఉధృతిని తగ్గించేందుకు గడ్డి జాతి మొక్కలపై కూడా మందును పిచికారీ చేయాలి.

  వేరు పురుగు:
  ఈ పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వేళ్లను తిని వేయడం వల్ల అవి ఎండిపోతాయి. ముందుగా మొక్క ఆకులు ఎండుముఖం పట్టి మెల్లమెల్లగా మొక్క చనిపోతుంది.

  నివారణ:
  పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవాలి. వీటికి ఆకర్షితులైన ప్రౌడ పెంకు పురుగులు ఎరకింద అమర్చుకున్న పురుగు మందుల డబ్బాలో పడి చనిపోతాయి. 50శాతం మేర తగ్గిపోతాయి. ఎదిగే తోటల్లో నివారణకు పోరేట్ 10 శాతం గుళికలను ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంతలు చేసి మందును వేస్తే దాని ఉధృతి తగ్గుతుంది. నివారణకు ఎంటామోఫాతోజెనిస్‌ శిలీంధ్రాలైన బవేరియా బస్సియాన, మెటరైజం అనైసాప్లెయాలను ఎకరాకు రెండు కిలోల చొప్పున వేసుకోవాలి.


   

Advertisement
 
Advertisement
 
Advertisement