ప్రచార ఆర్భాటంగా స్వైపింగ్‌

ప్రచార ఆర్భాటంగా స్వైపింగ్‌ - Sakshi


► దరఖాస్తు చేసి 15 రోజులైనా అందని మిషన్లు

► ఉన్న మిషన్లకు సర్వర్‌ బిజీ

►  ఇబ్బంది పడుతున్న జనం, వ్యాపారులు




పెద్ద నోట్లు రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు చేయాలంటూ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రజలకు, అటు వ్యాపారులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు.



తిరుపతి గాంధీరోడ్డు : నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు వెంటనే నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని పాలకులు, అధికారులు ఆదేశించారు. వ్యాపారులు అంగీకరించడమేగాక వారి పరిధిలోని బ్యాంకర్ల వద్ద స్వైపింగ్‌ (ఈ–పాస్‌) మిషన్ల కోసం రెండు వారాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. నేటికి ఒక్క మిషన్ కూడా రాలేదు. పెద్దషాపులు, షాపింగ్‌ మాల్స్‌లో తప్పా మిగతా దుకాణాల్లో ఏర్పాటు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి అ«ధికారులు, బ్యాంకర్లు తమ పరిధిలోని వ్యాపారుల వివరాలు సేకరించారు. మండల పరిధిలో ఎందరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.. అందులో ఎందరు ఏటీఎం కార్డులు వినియోగిస్తున్నారు.. ఆయా మండలాల పరిధిలో ఎన్ని బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించారు.


ప్రతి వందమందికీ ఒక ప్రతినిధిని నియమించి, ఈ–పాస్‌ యంత్రాన్ని అందజేసి, వారి ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా అవసరమైన సర్వే నిర్వహించి ఆ వివరాలను జిల్లా అధికారులకు పంపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ దిశగా ఇప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం 30వేల స్వైపింగ్‌ మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు ఎవరికీ రాకపోవడంలో వ్యాపారులు డీలా పడుతున్నారు. నెల రోజుల్లో ఎక్కడ చూసినా ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు చేతికి అందక ప్రజలు విలవిలలాడుతున్నారు. చిన్నపాటి లావాదేవీలు వదిలి, పెద్ద లావాదేవీలకు మాత్రమే స్వైపింగ్‌ మిషన్లు వీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.



సర్వర్‌ బిజీ..

కొన్ని దుకాణాల్లో ఎప్పటి నుంచో స్వైపింగ్‌ మిషన్లు ఉన్నాయి. గతంలో వీటికి పెద్దగా ఆదరణ కనిపించలేదు. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి వీటికి ఆదరణ పెరిగింది. అయితే ఉన్న కొద్దిపాటి మిషన్లకే సర్వర్‌ బిజీ అని వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో మిషన్లు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలూ వినిపిస్తున్నాయి.


అవగాహన ఏదీ?

ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై సరైన అవగాహన లేదు. పిల్లలు దుకాణాలకెళ్లి తినుబండారాలు, పెన్ను, పెన్సిల్‌ వంటి వాటికీ యంత్రాలు వినియోగించాలంటే ఇబ్బందులు తప్పవు. అల్పాదాయ వర్గాలకు కొంతవరకు నగదు రహితం నుంచి ఉపశమనం కల్పించాలి.  – అవినాష్‌రెడ్డి, పూల వ్యాపారి



దరఖాస్తు చేసి రెండు వారాలైంది

నగదు రహిత లావాదేవీలు ప్రారంభించేందుకు స్వైపింగ్‌ మిషన్  కోసం రెండు వారాల క్రితం బ్యాంకులో దరఖాస్తు చేశా. ఇప్పటివరకు మంజూరు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం. వేగంగా యంత్రాలు అందిస్తే లావాదేవీలు ప్రారంభించేందుకు వీలవుతుంది. – అబ్దాహీర్, ప్రొవిజన్  స్టోర్‌



ఇలాగే ఉంటే కష్టం

పరిస్థితులు ఇలాగే ఉంటే షాపుల్లోని కుర్రాళ్లకు జీతం ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. స్వైపింగ్‌ మిషన్లు లేక బేరాలు పోతున్నాయి. పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి నోట్లు రద్దు చేయడమే తెలుసుకాని దాని పరిష్కారంలో తీవ్ర లోపాలున్నాయి.      –కృష్ణమూర్తి, హార్డ్‌వేర్‌ వ్యాపారి



ప్రచారం చేసుకుంటున్నారు

ప్రభుత్వ పెద్దలు, అ«ధికారులు నగదు రహిత లావాదేవీల ప్రచారం పై చూపుతున్న ఆసక్తి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో చూప డం లేదు. బ్యాంకులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చిల్లర ఇవ్వకుండా రూ.2వేల నోట్లను మాత్రమే ఇస్తున్నాయి. దుకాణాల్లో పెద్దనోట్లకు చిల్లర ఇవ్వలేక అవస్థలు పడుతున్నాం. –సుధీర్‌రెడ్డి, హార్డ్‌వేర్‌ షాప్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top