 
															ఆపదలో అమ్మ
మాతృత్వం.. మహిళ జీవితంలో మధురానుభూతి పొందే క్షణం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఒకటే టెన్షన్.. ఆ పని చేయకూడదు.
	– రక్తహీనతతో గర్భిణుల బలి
	– అందని పోషకాహారం, వైద్య సేవలు
	– ఆడిట్ నిర్వహణలో పారదర్శకత కరువు
	– ఏడాదిగా జరగని జిల్లా స్థాయి సమీక్ష
	– ఇదీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తీరు
	
	37,800
	ప్రస్తుతం జిల్లాలో ఉన్న గర్భిణులు
	
	10 శాతం
	7 గ్రాముల కన్నా తక్కువగా హిమోగ్లోబిన్ ఉన్న గర్భిణులు
	
	40 శాతం
	7 గ్రాముల నుంచి 9 గ్రాములలోపు ఉన్న గర్భిణులు
	
	11-14 గ్రాములు
	గర్భిణుల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి
	
	గణాంకాలు ఇలా
	ఏడాది         మాతృ మరణాలు         
	2012–13        58            
	2013–14        58            
	2014–15        85            
	2015–16         71                
	2016–17        63    
	
	అనంతపురం మెడికల్: మాతృత్వం.. మహిళ జీవితంలో మధురానుభూతి పొందే క్షణం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఒకటే టెన్షన్.. ఆ పని చేయకూడదు..ఈ పని చేయకూడదు అని కుటుంబ సభ్యులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా...వైద్య ఆరోగ్యశాఖ పరంగా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కానీ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాతృత్వపు మాధుర్యాన్ని చూడకుండానే ఎంతో మంది మృత్యుఒడికి చేరుతున్నారు. ఏదో ఒక చోట మాతృ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఒక మరణం కూడా జరగకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా అమలులో చిత్తశుద్ధి లోపిస్తుండడంతో ‘మృత్యుఘోష’ ఆగడం లేదు.
	
	తూతూ మంత్రంగా ఆడిట్
	మాతృమరణాలపై జిల్లాలో సమగ్ర ఆడిట్ జరగడం లేదు. ఎందుకు చనిపోతున్నారన్న కారణాలను అన్వేషించే తీరికే అధికారులకు ఉండడం లేదు. ఏదైనా మాతృ మరణం జరిగితే డీఎంహెచ్‌ఓ, జాతీయ ఆరోగ్య మిషన్, పీహెచ్‌సీ, వైద్య విధాన పరిషత్‌కు చెందిన సీనియర్ వైద్యుల సమక్షంలో ఆడిట్ చేయాలి. ప్రతి నెలా కలెక్టర్ సమక్షంలో సమీక్ష జరగాలి. అయితే దీన్ని తూతూమంత్రగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏడాదిగా కనీసం సమీక్ష జరపని దుస్థితి నెలకొంది. ఏదో ఒక కారణం చూపి ఆ కేసులను మూసి వేస్తున్నారు. మాతృ మరణాలకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిర్వాకమా? లేక ప్రసవ సమయంలో సత్వర వైద్యం అందని పరిస్థితా..? అన్నది నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు.
	
	ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతోనే మరణాలు
	సహజంగా మాతృమరణాలు రక్తహీనత, ప్రసవ సమయంలో నిర్లక్ష్యం, హైరిస్క్ ప్రెగ్నెన్సీ (35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం) వల్ల సంభవిస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తగిన సూచనలు ఇవ్వడంతో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. చావుకు, తద్దినానికి ఒకటే మంత్రం అన్నట్లు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని తప్పించుకుంటున్నారు. ఒక వేళ రక్తహీనతతో మరణిస్తున్నారని తెలిస్తే అందుకు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
	
	ఎందుకంటే  రక్తహీనత నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతినెలా హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో పరీక్షలు నిర్వహించి రక్త శాతం తగ్గితే దాన్ని అధిగమించడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి పూర్తి స్థాయి అధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఉన్నాయి. రక్తం పెంపుదలకు అవసరమైతే మందుల ద్వారా చర్యలు చేపట్టడానికి ఆస్పత్రి అభివృద్ధి నిధులు, జననీ సురక్ష నిధుల నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంత అవకాశం ఉన్నా వైద్యులు సకాలంలో గర్భిణులకు వాడేలా అవగాహన కల్పించకపోవడం, నెలవారీగా వారికి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తెలుసుకోకపోవడం వంటివి మరణాలకు కారణమవుతున్నాయి.  
	
	అన్‌మోల్ నమోదూ అంతంతే..!
	గర్భం దాల్చిన మూడో వారం నుంచి వైద్య ఆరోగ్యశాఖ పరంగా అందించిన వైద్య పరీక్షలు, మందులు, పౌష్టికాహారం వంటివి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్‌మోల్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలి. గర్భిణులకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో వైద్య పరీక్షలు జరిపి గుర్తించాలి. ఏడు గ్రాముల కన్నా తక్కువ ఉంటే రక్తహీనతగా గుర్తించి వారిలో రక్తం పెంచడానికి ఐరన్, ఫోలిక్ మాత్రలు 120 రోజుల పాటు వాడించాలి. వాటిని మింగలేని వారికి అవే మందులతో కూడిన సిరప్ బయట మార్కెట్‌లో లభ్యమవుతుంది. దాన్ని తాగాలని సూచించాలి. ఈ వివరాల నమోదులో అధికారులు అంకెల గారడి చూపుతున్నారు. ప్రతి నెలా గర్భిణులకు అందించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తే ప్రసవ సమయంలో రక్తహీనత కారణంగా ఎవరైనా గర్భిణి చనిపోయిందని తేలితే అప్పుడు గర్భం దాల్చిన నాటి నుంచి రక్తహీనత అధిగమించేందుకు చర్యలు తీసుకోలేదని భావిస్తారు. దీని నుంచి తప్పించుకోవడానికి చివరకు అనుమోల్ సాఫ్ట్‌వేర్‌లో కూడా సమాచారం పూర్తి స్థాయిలో అప్‌లోడ్ చేయడం లేదు.
	
	త్వరలోనే సమావేశం పెడతాం
	రక్తహీనతతోనే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇవి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. తరచూ అధికారులతో సమావేశమై సూచనలు చేస్తున్నాం. త్వరలోనే మాతృ మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
	- డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
	
	రక్తహీనత అంటే...
	శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఉపిరితిత్తుల వద్ద హిమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకుని శరీరం మొత్తానికి దాన్ని సరఫరా చేస్తుంటుంది. హిమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాల్లోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళ్తుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క.
	
	జిల్లాలో గర్భిణులు : 37,800
	– ఒక లీటర్‌లో పదో వంతును డెసీలీటర్ అంటారు. ఒక డెసీలీటర్‌ను 1 డీఎల్ అని రాస్తారు.
	– మహిళల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి 12.1 నుంచి 15.1 గ్రాములు/డెసీలీటర్ ఉండాలి.
	– గర్భిణుల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి 11 నుంచి 14 గ్రాములు/డెసీలీటర్ ఉండాలి.
	– ప్రస్తుతం జిల్లాలో 7 గ్రాముల కన్నా తక్కువగా 10 శాతం మంది ఉన్నారు.
	– 7 గ్రాముల నుంచి 9 గ్రాములలోపు 40 శాతం మంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
