పాతకక్షలే కారణమా ? | Police suspicion on Anjaiah murder | Sakshi
Sakshi News home page

పాతకక్షలే కారణమా ?

Feb 13 2017 1:51 AM | Updated on Aug 21 2018 8:14 PM

మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో రైతు నోముల అంజయ్య (55) హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

అంజయ్య హత్యపై పోలీసుల అనుమానం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ యాదగిరి  
ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐ


సంస్థాన్‌ నారాయణపురం : మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో రైతు నోముల అంజయ్య (55) హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కొందరితో స్వల్ప గొడవలు ఉన్నాయని, వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నోముల అంజయ్య ఆదివారం తెల్లవారుజామున రోజు మాదిరిగానే తన ఇంటి నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ తనకున్న పశువుల దొడ్డిని శుభ్రం చేసి అక్కడే మంట వేసి చలి కాగుతున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన కత్తితో దాడి చేశారు. వెనుక నుంచి మెడపైన వేటు వేశారు.

దాంతో ఆయన కిందపడిపోవడంతో గొంతు భాగంతో పాటు మరో రెండుసార్లు తీవ్రంగా నరికారు. తలకు, మొండానికి మధ్యలో 40 శాతం గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర బావుల వద్దకు వెళ్లే రైతులు రక్తపు మడుగులో పడి ఉన్న అంజయ్యను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మల్లీశ్వరి అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ రంగప్రవేశం చేశాయి. నిందితులను గుర్తించడానికి ప్రయత్నించాయి.  

హత్యకు కారణం ఏంటి ?
ఈ హత్య వెనుక కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. భూ తగాదాలా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసేటప్పుడు ఒక్కడే పాల్గొన్నాడా, అనేక మంది కలిసి హత్య చేశారా, ఎలాంటి ఆయుధం ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అంజయ్యకు ఎవరితోనైనా పాతకక్షలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ
సంఘటన స్థలాన్ని యాదాద్రి భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి, చౌటుప్పల్‌ సీఐ నవీన్‌కుమార్‌ పరిశీలించారు. అనంతరం సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతోనే ఈ సంఘటనకు ఒడిగట్టారని తెలిపారు. మృతుడికి కొందరితో చిన్నచిన్న తగాదాలు ఉన్నట్లు తెలిసిం దని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నింది తులను పట్టుకుంటామని వివరించారు.  ఎస్‌ఐ మల్లీశ్వరి, ఏఎస్‌ఐలు యాదవరెడ్డి, శ్రీనివాసులు, యాదగిరి, సత్యం, కొండల్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement