భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్ | Sakshi
Sakshi News home page

భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్

Published Tue, Oct 13 2015 4:25 PM

petition filed against acquisition of lands for Bhogapuram airport

హైదరాబాద్ : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు భూ సేకరణపై మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఉప్పాడ సూర్యనారాయణ, కాకర్లపూడి సత్యనారాయణ రాజు ...న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 30వ తేదీలోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకూ రైతుల పంటలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించింది.

కాగా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు.  మరోవైపు కాగా భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement