పేదల బతుకులతో చెలగాటం | people lost of government decisions | Sakshi
Sakshi News home page

పేదల బతుకులతో చెలగాటం

May 28 2017 11:46 PM | Updated on Sep 5 2017 12:13 PM

పేదల బతుకులతో చెలగాటం

పేదల బతుకులతో చెలగాటం

ఆహార భద్రత చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపడుతూ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తోంది.

– ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
– నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటిగా తొలగింపు
– ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం
– త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం
– ఉపాధి కోల్పోనున్న 2,962 మంది డీలర్లు


ఆహార భద్రత చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపడుతూ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తోంది. తెల్లకార్డుదారులకు ఇస్తున్న నిత్యావసర వస్తువులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ పేదల బతుకులతో చెలగాటం ఆడుతోంది. జూన్‌ నుంచి చక్కెర, కిరోసిన్‌ పంపిణీ నిలిపివేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం పాడనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. - అనంతపురం అర్బన్‌

పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ఆసరాగా ఉంటోంది. అయితే దీనిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడకూదని 2013, సెప్టెంబరు 12న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు అండగా నిలవాల్సిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ముందుకు పోతోంది. చౌక దుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర, కిరోసిన్‌ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 11.92 లక్షలు తెల్లకార్డుదారులకు అరకేజీ చక్కెర పంపిణీ చేస్తున్నారు.

గ్యాస్‌ లేని వారికి రెండు లీటర్లు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే ఒక లీటరు పంపిణీ చేస్తున్నారు. జూన్‌ నుంచి చక్కెర, కిరోసిన్‌ పంపిణీ బంద్‌ చేస్తున్నట్లు జిల్లా యంత్రానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో జూన్‌కు సంబంధించి బియ్యం కోటాకు మాత్రమే డీడీలు తీయాలని డీలర్లకు మౌఖికంగా అధికారులు ఆదేశాలిస్తున్నారు. తాజాగా బియ్యం పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధపడుతోంది. బియ్యం బదులుగా నగదుని కార్డుదారుల ఖాతాలో జమ చేÄయాలనేది ప్రభుత్వం ఆలోచన. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 11.92 లక్షల కార్డులకు 1.81 లక్షల క్వింటాళ్ల బియ్యం అందజేస్తున్నారు. బియ్యం పంపిణీ నిలిపివేసి.. కార్డుదారులకు కిలోకు రూ.25 చొప్పున డబ్బుల్ని బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం.

ఉపాధి కోల్పోనున్న డీలర్లు
జిల్లావ్యాప్తంగా 2,962 చౌక ధరల దుకాణాలు (స్టోర్లు) ఉన్నాయి. బియ్యం పంపిణీ నిలిపివేస్తే డీలర్లు పూర్తిగా ఉపాధి కోల్పోతారు. వీరు ఇప్పటి వరకు కమీషన్‌ తీసుకుని దుకాణాలు నడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని సరుకులు పంపిణీ నుంచి తొలగించారు. జూన్‌ నుంచి చక్కెర, కిరోసిన్‌ బంద్‌ చేయనున్నారు. దీంతో వీటిపై వచ్చే కమీషన్‌ని డీలర్లు కోల్పోనున్నారు. బియ్యం కూడా బంద్‌ చేస్తే ఇక డీలర్లకు కమీషన్‌ పూర్తిగా పోతుంది. ఒక రకంగా చౌక దుకాణం మూతపడుతుంది. దీంతో డీలర్లందరూ వీధి పడాల్సి దుస్థితి నెలకొంటుంది.

బియ్యం కొనుగోలు పేదలకు భారమే
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం రకం బహిరంగ మార్కెట్‌లో లభ్యం కావు. కేవలం సన్న బియ్యం లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బియ్యం రూ.35 వరకు ఉంది. మునుముందు కిలో రూ.40 నుంచి రూ.45 వరకు పెరుగుతాయి. ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున డబ్బులు ఇస్తే కిలో మీద రూ.10 నుంచి రూ.15 అదనంగా వెచ్చించి లబ్ధిదారుడు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా యూనిట్లు (సభ్యులు) 35.64 లక్షల మంది ఉన్నాయి. సభ్యునికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఈ లెక్కన కిలో మీద నెలసరి రూ.10 అదనం వేసుకున్నా నాలుగు కిలోల మీద రూ.40 అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ ప్రకారం కార్డుదారులపై నెలసరి 14.25  కోట్లు భారం పడుతుందనేది స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement