ప్రకృతి సేద్యంతోనే స్వయం సమృద్ధి | owen development to traditional cultivation | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యంతోనే స్వయం సమృద్ధి

Sep 12 2016 10:43 PM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు వివరిస్తున్న పాలేకర్‌ - Sakshi

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు వివరిస్తున్న పాలేకర్‌

ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంభించినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధి సాధించగలదని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు.

– జీవామృతానిదే భవిష్యత్తు
–  రసాయన, సేంద్రియ ఎరువుల వాడకం నిషేధించండి
–  సుభాష్‌ పాలేకర్‌ పిలుపు 
తిరుపతి తుడా/అలిపిరి: ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంభించినప్పుడే భారతదేశం స్వయం  సమృద్ధి సాధించగలదని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. తిరుపతి వేదికగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమం రెండో రోజైన సోమవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతరమైన మన భూమి బంజరుగా మారడానికి రసాయన ఎరువుల వాడకమే కారణమన్నారు. దేశ జనాభా 123 కోట్ల మైలురాయిని దాటిందని, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికి 165 కోట్లు దాటే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 25 కోట్ల మెట్రిక్‌ టన్నులు ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే  2050 నాటికి 50 కోట్ల  మెట్రిక్‌ టన్నుల ఆహార పదార్థాల ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందన్నారు. మరి దిగుబడి తగ్గుతున్న ఈ రోజుల్లో 50 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆహార భద్రత సాధ్యమవుతుందన్నారు. జీవామృతం ద్వారా చేపట్టే ప్రకృతి  వ్యవసాయానిదే భవిష్యత్తు అని గుర్తు చేశారు. రైతులు ముందుకు వచ్చి రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించాలని సూచించారు. రసాయన ఎరువులు మోతాదుకు మించి వినియోగించడంతోనే సారవంతమైన మన భూమి కలుషితం అయ్యిందన్నారు. తద్వారా పంట దిగుబడులు తగ్గి పెట్టుబడులు భారానికి మించిపోయిందని చెప్పారు. 
 ‘కేశాకర్షణ శక్తి’తోనే మొక్కల ఎదుగుదల 
మొక్కల్లో సహజ సిద్ధంగా  కేశాకర్షణ శక్తి దాగి ఉంటుందని, దానికి ఎటువంటి విఘాతం కలిగించకుంటే  మొక్క ఎదుగుదల వేగంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ పాలేకర్‌ తెలిపారు. మట్టి కణాల మధ్య ఖాళీలు ఉంటాయని, వాటి ద్వారానే మొక్క వేర్లకు పోషకాలు, నీరు అందుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకం వల్ల మట్టిలోని ఖాళీల్లో రసాయన లవణాలు భర్తీ అయ్యి మొక్కల పెరుగుదలకు అవరోధంగా మారుతుందన్న సత్యాన్ని రైతులు గమనించాలని కోరారు. అలాగే వానపాముల విసర్జనాల్లో దాగి ఉన్న పోషకాల గురించి రైతులకు వివరించారు. 
జీవామృతంతో సూక్ష్మజీవుల అభివృద్ధి
వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి, అధిక ఆరోగ్యవంతమైన దిగుబడులు సాధించాలంటే జీవామృతంతోనే సాధ్యమవుతుందని సుభాష్‌ పాలేకర్‌ చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చన్నారు. పంట ఎదుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులను జీవామృతం తగిన మోతాదులో అందించే సత్తా ఉంటుందని చెప్పారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement