‘సర్కిల్‌’ సగం | Sakshi
Sakshi News home page

‘సర్కిల్‌’ సగం

Published Thu, Jun 29 2017 12:55 AM

‘సర్కిల్‌’ సగం - Sakshi

విడిపోనున్న ఖమ్మం సర్కిల్‌ కార్యాలయం
భద్రాద్రి జిల్లాకు ‘పవర్‌’ సర్కిల్‌
ట్రాన్స్‌కో ఎస్‌ఈ పోస్టు మంజూరు
నాలుగు సర్కిళ్లుగా ఖమ్మం పాత సర్కిల్‌
పోస్టుల విభజనపై దృష్టి పెట్టిన అధికారులు

ఖమ్మం: మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం డీఈ స్థాయి అధికారిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసింది. నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌పీడీసీఎల్‌) పరిధిలోని ఖమ్మం సర్కిల్‌ ఇప్పుడు రెండుగా విడిపోనుంది.


ఖమ్మం సర్కిల్‌ పరిధిలోనే ప్రస్తుతం రెండు జిల్లాలకు సంబంధించిన కార్యకలాపాలు ఖమ్మం కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాకు సర్కిల్‌ మంజూరు చేయడంతో మరో నెల రోజుల్లో కొత్తగూడెం కేంద్రంగా ఎన్‌పీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇందుకోసం ఇప్పటికే సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) పోస్టును ఆ శాఖ ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సర్కిల్‌ కార్యాలయ నిర్వహణకు కావాల్సిన మిగిలిన పోస్టుల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు.

నాలుగు సర్కిళ్లుగా ఖమ్మం
జిల్లాల పునర్విభజనకు పూర్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మం సర్కిల్‌ పరి ధిలోనే ఉండేది. జిల్లాలు విడిపోవడంతో  వాజే డు, వెంకటాపురం మండలాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లగా, గార్ల, బయ్యా రం మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లాయి. అయితే సర్కిళ్ల పునర్విభజన జరగకపోవడంతో ఇప్పటివరకు ఈ నాలుగు మండలాలు సైతం ఖమ్మం సర్కిల్‌ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాలను సర్కిల్‌ కార్యాలయాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత ఖమ్మం సర్కిల్‌ పరిధి ఇప్పుడు నాలుగు సర్కిళ్ల పరిధిలోకి విడిపోనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సర్కిళ్లతోపాటు జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లే విద్యుత్‌ కనెక్షన్లను అధికారులు విభజించారు.

రెండు సర్కిళ్లకు రెండేసి డివిజన్లు..
ప్రస్తుతం ఖమ్మం ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్‌ కేంద్రాలుగా డీఈ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం సర్కిల్‌ విభజన నేపథ్యంలో ఖమ్మం, సత్తుపల్లి డివిజన్లు ఖమ్మం సర్కిల్‌ పరిధిలోకి రానుండగా.. కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లు కొత్తగూడెం సర్కిల్‌ కార్యాలయం పరిధిలోకి రానున్నాయి. దీంతోపాటు సర్కిల్‌ కేంద్రంలో డీఈ పోస్టుల విభజనపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. అవసరం మేరకు కొత్త సర్కిల్‌లో డీఈ పోస్టులను మంజూరు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే రెండు జిల్లాలకు సం బంధించిన పూర్తి సమాచారం, రెండు సర్కి ళ్ల పరిధిలోకి వచ్చే సబ్‌స్టేషన్లు, కనెక్షన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

రెండు జిల్లాల్లో 9లక్షల కనెక్షన్లు..
ప్రస్తుతం ఖమ్మం సర్కిల్‌ పరిధిలోని కొన్ని కనెక్షన్లు మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్తుండగా.. మిగిలిన మొత్తాన్ని రెండు సర్కిళ్ల పరిధిలోకి విభజించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోకి 17,821 కనెక్షన్లు వెళ్తుండగా.. మహబూబాబాద్‌ జిల్లాలోకి 27,070 కనెక్షన్లు వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడే సర్కిల్‌ విభజనపైనే అధికారులు దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లోని అన్ని కేటగిరీల్లో 9.10 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. ఖమ్మం సర్కిల్‌ పరిధిలోకి 5,53,303 కనెక్షన్లు వస్తుండగా, భద్రాద్రి జిల్లా సర్కిల్‌లోకి 3,56,845 కనెక్షన్లు వెళ్తున్నాయి.

రెండు జిల్లాల్లో సర్కిళ్ల పరిధిలోకి వచ్చే కనెక్షన్ల వివరాలు..
  ఖమ్మం                                           భద్రాద్రి                           కొత్తగూడెం
గృహ వినియోగదారులు                         4,16,554                          2,89,581
కమర్షియల్‌                                         36,359                              27,053
చిన్నతరహా పరిశ్రమలు                         3,131                                  1,195
కుటీర పరిశ్రమలు                                   369                                     228
వ్యవసాయం                                      87,809                               33,956
విద్యుత్‌ దీపాలు, నీటి సరఫరా                   5,128                                 2,820
దేవాలయాలు, పాఠశాలలు                      3,384                                 1,940
తాత్కాలిక కనెక్షన్లు                                     10                                     0
పెద్దతరహా పరిశ్రమలు                                559                                     72
మొత్తం                                           5,53,303                            3,56,845.

Advertisement
Advertisement