మం‘జీరో’! | Sakshi
Sakshi News home page

మం‘జీరో’!

Published Sat, Jul 23 2016 7:56 PM

ఎగువనుంచి మంజీరాలోకి వస్తున్న వరద - Sakshi

  • నదిలోని నీరొస్తున్నా కళతప్పిన నీటి పథకాలు
  • ‘శాపూర్‌’ వద్ద పనులు చేపట్టని అధికారులు
  • ఎగువున మరిన్ని భారీ వర్షాలు కురిస్తేనే ఆశలు
  • నారాయణఖేడ్‌: మంజీరా నదిలోకి చేరుతున్న వరద.. నీటి పథకాలకు ఏమాత్రం ఊతమివ్వడం లేదు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే నదికి జీవకళ వచ్చేది. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో నది వట్టిపోయింది. ఈనేపథ్యంలో రెండ్రోలుగా ఎగువు ప్రాజెక్టుల నుంచి కొద్దికొద్దిగా నీరు వస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, భారీ వరదలు వస్తే తప్ప సింగూరు వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు నీరు చేరని పరిస్థితి. ప్రస్తుతం చిన్నపాటి ఇన్‌ఫ్లో వల్ల సింగూరు ప్రాజెక్టుకు ఆదివారానికి కొద్దిగా నేరు చేరే పరిస్థితి ఉంది.

    మంజీరా నది జిల్లాలో మనూరు మండలం గౌడ్‌గాం జన్‌వాడ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, మెదక్‌ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టు ఎగువున మంజీరాపై నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌ తదితర నియోజకవర్గాల నీటి పథకాలు ఉన్నాయి. వరద పెరిగి బ్యాక్‌వాటర్‌ నిలిస్తే తప్ప నీటిపథకాలు పనిచేయని పరిస్థితి. శాపూర్‌ నీటిపథకం వద్ద భారీ లోయ ఉండటంతో అక్కడ కొద్దిగా నీరు పంపింగ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది.

    ఈ పథకం వద్ద మోటార్ల మరమ్మతులతో పాటు చిన్నపాటి పనులు చేయాలని ఎమ్మెల్యే ఇటీవల ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశించినా పనులు ప్రారంభం కాలేదు. ఖేడ్‌ నియోజకవర్గం బోరంచ, గూడూరు ఇన్‌టేక్‌వెల్‌.. జహీరాబాద్‌ నియోజకవర్గం పుల్‌కుర్తి వద్ద ఉన్న ఇన్‌టేక్‌వెల్‌ వరకు పూర్తిస్థాయిలో వరద నీరు రాలేదు.

    ఇవీ పథకాలు
    గూడూరు వద్ద 13 ఏళ్ల క్రితం రూ.14కోట్లతో మంజీరా నదిపై 74 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటిపథకం నిర్మించారు. ఎన్‌ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేజ్‌-1 కింద 32 గ్రామాలకు, శాపూర్‌ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గంలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటు పుల్‌కుర్తి సమీపంలోని నీటి పథకం ద్వారా జహీరాబాద్‌ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా జరుగుతోంది.

    నీరు నిలవాల్సిందే
    సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరితే తప్ప నీటి పథకాలు పనిచేసేందుకు పరిస్థితి లేదు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఉన్నా.. మంజీరా నదిలో నీరు లేని కారణంగా వరద నీరు కిందకు పోతోంది. సింగూరు ప్రాజెక్టు నిండితేనే మంజీరా నదిలో నీరు నిలిచి బ్యాక్‌వాటర్‌ పెరిగే అవకాశం ఉంది. ఇందుకు మరిన్ని వరదలు రావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నదిలోకి నీరు చేరకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వారం రోజుల పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్ప.. నీటి పథకాలు పనిచేయని దుస్థితి ఉంది. మంజీరా నదిలోకి నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోరు, బావులు రీచార్జ్‌ కానున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement