ప్చ్‌.. ఏం లాభం!

ప్చ్‌.. ఏం లాభం!

- వచ్చిన కరెన్సీ మొత్తం రూ. 2వేల నోట్లే

- ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన కరెన్సీ రూ. 700 కోట్లు

- ఇందులో రూ.600 కోట్లు రూ.2వేల నోట్లే

- ప్రత్యామ్నాయం లేక తీసుకుంటున్న జనం

- దాన్ని మార్చుకునేందుకు నానా తంటాలు 

- జనానికి తీరని నగదు కష్టాలు

 

రూ. 2వేల నోటు.. నగదు కొరత నేపథ్యంలో ఎవరి వద్ద చూసినా రూ.2వేల నోటే కనిపిస్తోంది.. కానీ ఏ లాభం.. ఆ నోటు జనం అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతోంది.. జేబుల్లో డబ్బుందన్న మాటే కానీ దాన్ని మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. .బ్యాంకుకు వెళ్లినా, ఏటీఎం వద్ద క్యూ ‍కట్టినా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయం లేక ఈ నోటును తీసుకుంటున్నారు తప్ప దానికి ఆ స్థాయి ఆదరణ లభించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట చెల్లకుండా మిగిలిపోయిన  వెయ్యి, పాత ఐదొందల నోటుకు ప్రస్తుతం అంతటా లభిస్తున్న రెండు వేల నోటుకు పెద్ద తేడా ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ నోటును రద్దు చేశారు కాబట్టి దుకాణదారులు తీసుకోవడం లేదు.. అంత మొత్తంలో చిల్లర దొరకదు కాబట్టి ఈ నోటును వద్దంటున్నారు. 

 

కర్నూలు(అగ్రికల్చర్‌): రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాకు కొత్త కరెన్సీ దాదాపు రూ.700 కోట్లు వచ్చింది. ఇందులో రూ.600 కోట్ల వరకు రూ.2వేల నోట్లు మత్రమే వచ్చాయి. ఇంతవరకు జిల్లాకు కొత్త రూ.500 నోట్లు నామమాత్రంగానే వచ్చాయి. రూ.100 నోట్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లో చిల్లర పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలుగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. పింఛన్‌ దారులు బ్యాంకుకు వెళ్తే ఇద్దరికి కలిపి రూ.2వేల నోటు ఇస్తున్నారు. మార్కెట్‌లో రెండు వేల నోట్లు తప్ప ఇతర నోట్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవడంలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్ని, ఇన్నీ కావు. ఇంత పెద్దనోటు వద్దు బాబోయ్‌ అన్ని జనం మొత్తుకుంటున్నా.. రూ. 500, రూ.100 నోట్లు సరఫరా చేయాలని బ్యాంకర్లు కోరుతున్నా... ఆర్‌బీఐ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో జిల్లాకు వందలు, ఐదు వందల నోట్లు తెప్పించాలని బ్యాంకర్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తెస్తున్నారు. 

తీవ్రమవుతున్న చిల్లర కొరత

జిల్లాకు ఇటీవలే రూ.160 కోట్లు వచ్చాయి. ఇదంతా రూ.2వేల నోట్ల రూపంలోనే ఉంది. దీంతో చిల్లర సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు, పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోటుకు చిల్లర లభించకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇటీవల నందికొట్కూరులో ఓ వ్యక్తి అత్మహత్యాప్రయత్నం చేశారు.  జేబులో రెండువేల నోటున్నా టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రూ.1000కి పైగా వ్యాపారం చేస్తే తప్ప వ్యాపారులు చిల్లర ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు.  హోటల్‌కు వెళ్తే రూ.500, 100 నోట్లుంటేనా రావాలని చెబుతుండంతో జనం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

‘వంద’కు వెలుగు..

బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం మేరకు జిల్లాలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన 100 నోట్లున్నాయి. కాని ఈ స్థాయిలో 100 కనిపించడం లేదు. కర్నూలుతో సహా వివిధ ప్రాంతాల్లో వ్యాపారులు, మరికొందరు 100 నోట్లను భారీ ఎత్తున బ్లాక్‌ చేయడంతో కొరత మరింత తీవ్రమైంది. కొంత మంది 2వేల నోటుకు కమీషన్‌ విధానంలో చిల్లర ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు వంద నోట్లను బ్లాక్‌ చేయడం వల్ల మార్కెట్‌లో వీటికి కృత్రిమ కొరత ఏర్పడింది. నేడు కరెన్సీలో వందనోట్లు రారాజుగా మారాయి.

 

రెండు వేల నోట్లను మార్చడం కష్టంగా మారింది.... విజయకుమార్‌ ఏపీఎంఐపీ ఉద్యోగి

ఇటీవల కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్రాంచీకి జీతం తీసుకునేందుకు వెళ్తే అన్ని 2వేల నోట్లు ఇచ్చారు. వీటిని మార్చుకోవడంలో తల ప్రాణం తోకకు వస్తోంది. ఎక్కడ అడిగినా వంద నోట్లు లేవంటున్నారు. ప్రభుత్వం అన్ని రకాల కరెన్సీ సరఫరా చేస్తే బాగుంటుంది. కాని అన్ని పెద్దనోట్లే వస్తుండటం వల్ల చిల్లర సమస్య తీవ్రమవుతోంది. రూ.2వేల నోటు జేబులో ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top