Sakshi News home page

నరికేస్తా..

Published Sat, May 6 2017 11:00 PM

నరికేస్తా.. - Sakshi

- చైర్‌ పర్సన్‌సమక్షంలోనే  సొంత పార్టీ కౌన్సిలర్లపై కురుగొండ్ల చిందులు
- రాజీనామా యోచనలో చైర్‌పర్సన్, పలువురు కౌన్సిలర్‌లు
- ఎమ్మెల్యే వ్యవహార తీరుపై బీదకు ఫిర్యాదు


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన మాట తీరు, వ్యవహార తీరుతో తరచూ వివాదాల్లో  ఇరుక్కుంటున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం మరో వివాదంలో ఇరుక్కున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద సమక్షంలోనే కౌన్సిలర్లను ‘‘నరికేస్తా నా కొ...రా ఏ మనుకున్నారు’’ అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం వెంకటగిరి టీడీపీలో కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే తీరుతో తీవ్ర ఆందోళనకు గురైన చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు పదవులు, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొంతు శారదతో పాటు సుమారు 15 మంది కౌన్సిలర్లు కొంత కాలంగా ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మున్సిపాలిటీలో ప్రతి పనిలో తల దూర్చడం, తాను చెప్పినట్లే చేయాలని అధికారులను బెదిరిస్తుండటంతో చైర్‌ పర్సన్‌ ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ వ్యవహారం గురించి మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు వారు ఆమెను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రామకృష్ణ మున్సిపల్‌ కార్యాలయంలో అభివృద్ధి పనుల సమీక్ష కోసం కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు.

కమీషన్ల గోల
మున్సిపాలిటీలో తమ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు తమకు కావాల్సిన వారికి దక్కడం లేదనీ, పనులకు సంబంధించి తమకు 6 శాతం కమీషన్‌ ఇస్తూ 14 శాతం ఇతరులకు సమర్పించుకుంటుండటం పట్ల కౌన్సిలర్లు కోపంతో ఉన్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే రామకృష్ణకు తెలిసే జరుగుతుండటంతో ఇదేమని ప్రశ్నించే ధైర్యం చేయలేక పోతున్నారు. ఇదే విషయం గురించి వారం రోజుల కిందట 22వ వార్డు కౌన్సిలర్‌ విశ్వనాథం కమిషనర్‌ మధ్య మున్సిపల్‌ కార్యాలయంలోనే మాటల యుద్ధం జరిగింది. తమ వార్డుల్లో జరిగే పనులకు ఇతరులకెందుకు కమీషన్లు ఇవ్వాలని కౌన్సిలర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఒక దశలో ఇద్దరూ ఒరేయ్‌ పోరా అనుకునేంత వరకు పోయారు. కమిషనర్‌ ఈ విషయం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో తనకు వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పడం జీర్ణించుకోలేని రామకృష్ణ సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అభివృద్ధి పనుల విషయం గురించి చర్చించడం కోసం శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. టెండర్లు, పనుల విషయం గురించి చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఒక్కసారిగా చెలరేగి పోయారు.

ఎదురుగా ఉన్నది సొంత పార్టీ కౌన్సిలర్లే అనే విషయం కూడా మరచి పోయి ‘‘నా కొడకల్లారా ఏ మనుకుంటున్నారు. నరికేస్తా.’’ అని గతంలో తాను చేసిన కొన్ని విషయాల గురించి చెప్పి కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో తొలుత భయపడ్డ కొందరు కౌన్సిలర్లు ఆ తర్వాత తేరుకుని తమకు జరిగిన అవమానం గురించి ఆవేదనకు లోనయ్యారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే మద్దతుదారుడైన ఒక కౌన్సిలర్‌ తన వార్డులో బోరు వేయించుకోవడానికి లెటర్‌ ఇస్తే చైర్‌ పర్సన్‌ సంతకం చేయలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే చైర్‌ పర్సన్‌ను ఉద్దేశించి ‘‘నా వర్గీయుడికి సంతకం చేయవా? సంతకం పెట్టాల్సిందే’’ అని ఆగ్రహంగా హెచ్చరికలు జారీ చేశారు. కౌన్సిలర్ల సాక్షిగా తనకు  జరిగిన అవమానానికి చైర్‌ పర్సన్‌ చిన్నబుచ్చుకున్నారు.

 తన మద్దతుదారులైన కౌన్సిలర్లతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా నెల్లూరుకు బయల్దేరే సమయంలో కావేరి పాకం రమేష్‌ తమ రాజీనామా విషయం గురించి రాజా కుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్ర సలహా తీసుకోవడానికి వెళ్లారు.

ఆయన సూచన మేరకు కౌన్సిలర్లు వెంకటగిరిలోనే ఆగిపోయి చైర్‌ పర్సన్‌ ఆమె భర్త దొంతు బాలకృష్ణ నెల్లూరు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రను కలసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. తాను  పార్టీకి పదవికి రాజీనామా చేస్తాననీ, కురుగొండ్లతో తాము పడలేకున్నామని చైర్‌ పర్సన్‌తో పాటు ఆమె భర్త కూడా బీద రవిచంద్రకు విన్నవించారు. వారం రోజుల్లో ఈ సంగతి తేలుస్తాననీ, పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రవిచంద్ర వారిని బుజ్జగించి పంపారు. అయితే తాజా సంఘటన వెంకటగిరి టీడీపీలో ముసలం పుట్టించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement