మైనింగ్‌కు ‘పెద్ద’ కష్టం


బనగానపల్లె: పెద్దనోట్ల రద్దు ప్రభావం జిల్లాలోని మైనింగ్‌ పరిశ్రమపై పడింది. దీంతో ఉపాధి కోల్పోయి కూలీలు విలవిల్లాడుతున్నారు. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో మైనింగ్‌ అధికారుల లెక్కల ప్రకారం అధికారికంగా సుమారు 1660 నాపరాతి మైనింగ్‌ గనులు ఉన్నాయి. అనధికారికంగా మరో 300 మైనింగ్‌ గనులు ఉండగా ఇందులో సుమారు 35వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. మైనింగ్‌ గనుల్లో ఒక్కొక్కరు రోజుకు 8 గంటలు శ్రమిస్తే మగవారు రూ.350–400లు, ఆడవారు రూ.250–300లు సంపాదించే అవకాశం  ఉంది. స్థానికులేకాక ఇతర జిల్లాల నుంచి ఎంతో కాలంగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 

తగ్గిన వ్యాపారాలు..

 ఈనెల 8వ తేదీన పెద్దనోట్లను రద్దు చేయడంతో మైనింగ్‌ యజమానులతోపాటు ఇందులో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తనోట్లు ఇవ్వాలని పేచీ పెట్టడంతో వ్యాపారం స్తంభించిపోయింది. గతంతో పోల్చుకుంటే 60–70 శాతం వ్యాపారం కుంటుపడినట్లు మైనింగ్‌ యజమానులు వాపోతున్నారు. గనుల్లో మైనింగ్‌ పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మైనింగ్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే తమ సొంత ప్రాంతాలకు వెళ్లవలసివస్తుందని వారు వాపోయారు. 

నిలిచిపోయిన పాలిష్‌ ఫ్యాక్టరీలు : 

నియోజకవర్గంలో నాపరాతి పాలిష్‌ ఫ్యాక్టరీలు సుమారు 1000 వరకు ఉన్నాయి. ఇందులో 9–10వేల మంది కార్మికులు పనిచేస్తున్న విషయం విదితమే. ఈ ప్రభావం పాలిష్‌ ఫ్యాక్టరీ యజమానులపైనను పడడం వల్ల చాలా వరకు ఇప్పటికే ఫ్యాక్టరీలను నిర్వహించలేక మూసివేశారు. అందులో పనిచేయు కార్మికులకు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. 

 

వివరాలు 

మండలం        మైనింగ్‌ గనులు   పాలిష్‌ఫ్యాక్టరీలు   మొత్తం కార్మికులు

బనగాననపల్లె 820 300 17000

కొలిమిగుంండ్ల 800 400 18000

అవుకు 150 300 4500

 

నిర్వహణ ఇబ్బందిగా మారింది : శ్రీను, మైనింగ్‌ యజమాని, పలుకూరు

పెద్దనోట్ల రద్దుతో మైనింగ్‌ నిర్వహణ ఇబ్బందిగా మారింది. గనుల్లో ఉత్పత్తి అయిన నాపరాయి రవాణా జరగనందున మరికొంత ఉత్పత్తి చేయడం భారంగా మారింది. ఇందులో పనిచేసే కార్మికులకు చిల్లర నోట్లు ఇవ్వడం కష్టంగా మారింది. 

 

కుటుంబ పోషణ భారంగా మారింది : చంద్రయ్య, మైనింగ్‌ కార్మికుడు, అంకిరెడ్డిపల్లె కొలిమిగుండ్ల మండలం

మా కుటుంబంలో నేను నా భార్యతోపాటు మరో ముగ్గురు  ఉన్నారు. వారం రోజులుగా మైనింగ్‌ పనులు నిలిచిపోవడంతో ఉపాధి పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అవసరాల కోసం డబ్బులు లభించడం లేదు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top