బతుకు చూపిన ‘పాడి’ | milk business famous in basavanapalli | Sakshi
Sakshi News home page

బతుకు చూపిన ‘పాడి’

Jan 20 2017 11:38 PM | Updated on Sep 5 2017 1:42 AM

బతుకు చూపిన ‘పాడి’

బతుకు చూపిన ‘పాడి’

వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది.

వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు మానసికంగా నలిగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్ట లేకపోయింది. పంట సాగు తప్ప మరో పని చేతకాని రైతన్నలు ప్రత్యామ్నాయ  రంగాలపై దృష్టి సారించారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడిపోషణ వైపు ఆసక్తి పెంచుకున్న అన్నదాత... ఆర్థికంగా బలపడుతూ వచ్చాడు. తనతో పాటు మరికొన్ని కుటుంబాలకు బతుకు చూపుతున్నాడు.
- లేపాక్షి (హిందూపురం)

లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని కె.బసవనపల్లి రైతులు పాడిపరిశ్రమలో రాణిస్తున్నారు. 76 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ‍ప్రతి కుటుంబానికి మూడు, నాలుగు పాడి ఆవులు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామం నుంచే ప్రతి రోజూ ఉదయం 400 లీటర్లు, సాయంత్రం మరో 450 లీటర్ల పాలు డెయిరీలకు చేరుతోంది.

ప్రభుత్వ ప్రోత్సహం లేకున్నా..
కె.బసవనపల్లిలోని 90 శాతం మంది పాడి పరిశ్రమనే జీవనాధారంగా చేసుకున్నారు. ‍ప్రత్యేక శ్రద్ధతో మేలుజాతి పాడి ఆవులను కొనుగోలు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్‌లో ఉంచుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తుంటారు. పోషకాహారమైన దాణాతో పాటు పచ్చిగడ్డిని అందజేస్తున్నారు. పాడి ఆవుల పెంపకం చేపట్టిన తర్వాతనే గ్రామంలోని రైతులు ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ మాత్రం ఆశించకుండా స్వయం కృషితో అనూహ్యమైని విజయాలను ఇక్కడి రైతులు సొంతం చేసుకుంటున్నారు. పితికిన పాలను అలాగే డెయిరీలకు తరలిస్తుంటారు. అంతేకాక ఆ పాలలో ఎల్‌ఆర్‌, ఫ్యాట్‌,  ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాలను పరిశీలించేందుకు రైతులు సొంతంగా ఓ ఎనలైజర్‌నే ఏర్పాటు చేసుకున్నారు.

పాడి ఆవులే ఉపాధి
మా ఇంటిలో ఉన్న ఐదుగురుమూ పాడి పోషణపై ఆధారపడి ఉన్నాం. తొమ్మిది ఆవులు, మూడు లేగదూడలు ఉన్నాయి. వాటి బాగోగులు చూడడం, స్నానాలు చేయించడం రోజూ వారి పనిగా పెట్టుకున్నాం. తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటాం. తొమ్మిది ఆవుల నుంచి రోజూ 140 లీటర్ల పాలు సేకరిస్తున్నాం. దీని ద్వారా రోజూ రూ. 3వేలు ఆదాయం వస్తే అందులో నుంచి పశుగ్రాసం, దాణా కోసం రూ. 1,500 పోతోంది.
– అశ్వత్థప్ప, బసవనపల్లి

పశుగ్రాసం కొరతగా ఉంది
నా వద్ద రెండు పాడి ఆవులు, రెండు లేగదూడలు ఉన్నాయి. ప్రతి రోజూ పది లీటర్ల పాలను డెయిరీకి అందజేస్తున్నాను. పితికిన పాలను అలాగే తీసుకెళుతుంటాను. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య లేకుంటే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది.
– శ్రీనివాసులు, బసవనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement