రాయలసీమ, కోస్తాంధ్రకు మధ్య వివాదరహిత ప్రాంతమైన మార్కాపురం కేంద్రంగా సీమాంధ్ర రాజధాని నిర్మించడం సముచితమని రాష్ట్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది.
మార్కాపురం, న్యూస్‌లైన్: రాయలసీమ, కోస్తాంధ్రకు మధ్య వివాదరహిత ప్రాంతమైన మార్కాపురం కేంద్రంగా సీమాంధ్ర రాజధాని నిర్మించడం సముచితమని రాష్ట్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ అడహాక్ కన్వీనర్ డాక్టర్ బి.సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో ఆయన వైద్యశాలలో నేతలు గాయం వెంకట నారాయణరెడ్డి, డాక్టర్ బీవీ శ్రీనివాసశాస్త్రి, చాబోలు బాల చెన్నయ్య శనివారం విలేకరులతో మాట్లాడారు. భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మార్కాపురంలో సంభవించవని.. వేల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు అందుబాటులో ఉండడం రాజధాని నిర్మాణానికి అనుకూలమన్నారు. గుండ్లకమ్మ నది.. వెలిగొండ ప్రాజెక్టు.. నాగార్జున సాగర్ జలాలు అందుబాటులో ఉన్నాయని.. అన్ని ప్రాంతాలను కలుపుతూ రాష్ట్ర రహదారులు, రైల్వే లైన్, రోడ్డు రవాణా సౌకర్యం ఉందన్నారు.
పురాతనమైన, విస్తరణకు అవకాశం ఉన్న దొనకొండ విమానాశ్రయం అందుబాటులో ఉందని.. మానవ వనరులకు కూడా కొదువ ఉండదని తెలిపారు. నల్లమల అభయారణ్యంతో కూడిన వాతావరణం ఉందని, ప్రసిద్ధి గాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రం, త్రిపురాంతక దేవాలయాలు కూడా ఈ ప్రాంతం కిందకే వస్తాయన్నారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టుకు హామీ, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, వివిధ జిల్లాల్లో ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, యూనివర్శిటీలు ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాలకు మధ్యగా ఉండే మార్కాపురం కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని,యూపీఏ చైర్‌పర్సన్, జీఓఎం, గవర్నర్, కలెక్టర్‌కు వినతి పత్రాలు పంపుతున్నట్లు తెలిపారు.
26న సమావేశం
పశ్చిమ ప్రకాశంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులతో 26న సాయంత్రం స్థానిక ఎన్జీఓ హోంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి రాజధాని సాధన కోసం ర్యాలీలు, సదస్సులు నిర్వహించేందుకు అంద రూ సహకరించాలని కోరారు. సీమాంధ్ర రాష్ట్ర రాజధాని కోసం అటవీ భూములను పరిశీలిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.