సిర్‌పూర్‌లో వ్యక్తి దారుణహత్య
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్‌పూర్‌లో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన మాధాపూర్ శ్యాం(45) దారుణ హత్యకు గురయ్యాడు.
-
గొడ్డలితో నరికి చంపిన దుండగులు
-
రక్తపు మడుగులో మృతదేహం
-
డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ
నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్‌పూర్‌లో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన మాధాపూర్ శ్యాం(45) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి ఇంట్లో గొడ్డలితో నరికి హతమార్చారు. సోమవారం ఉదయం పక్కింట్లో ఉండే బంధువులు వచ్చి చూడగా రక్తపు మడుగులో శ్యాం మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు విషయం తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసు డాగ్ స్క్వాడ్ బృందం తెప్పించి గ్రామంలో పరిశీలన చేశారు. మృతుడు శ్యాంకు భార్య స్వర్ణ, ఇద్దరు పిల్లలు ఉండగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా ఆమె భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని ఆర్మూర్‌కు వెళ్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి శ్యాం ఇంట్లోనే ఉండేవాడు. పొద్దంతా తిరిగి రాత్రికి స్నేహితులతో కలిసి వచ్చి ఇంట్లోనే ఉండేవాడని స్థానికులు తెలిపారు. కొత్తకొత్త స్నేహితులు ఇళ్లకు వచ్చే వారని వివరించారు. విషయాన్ని భార్యకు తెలపడంతో ఆమె పిల్లలను తీసుకొని సిర్‌పూర్‌కు వచ్చింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు దీపిక ఇంటర్మీడియట్ చదువుతోంది. గతంలో మృతుడు పలు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడని, రూరల్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. తమ్ముడు చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.