
15 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
విషమంగా మారిన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండుగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితులు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. బయాబర్ గ్రామంలోని నవగోపాల్‌పూర్ బస్తీలో శనివారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్ వచ్చి అడ్డగించారు. సమీపంలోని భార్గవి నది గట్టుకు బలవంతంగా లాక్కెళ్లారు. చేతులు కట్టేసి పెట్రోల్ చల్లి, నిప్పంటించి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఎనిమిదో తరగతి వరకు చదుకుంది. మధ్యలో చదువు మానేసింది. ఆమె తండ్రి మెకానిక్‌గా పని చేస్తున్నాడు. బాలిక పట్ల రాక్షసంగా ప్రవర్తించిన దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని ఒడిశా డీజీపీ వై.బి.ఖురానియా ప్రకటించారు. బాలికను హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించారన్నది తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిపడ్డాయి.
మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపించారు. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది. ‘బేటీ బచావో’ అంటే ఇదేనా? అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు రక్తంతో తడిచాయని విమర్శించింది. ఒడిశాలో వారం రోజుల క్రితమే కాలేజీ విద్యార్థిని(20) ఆత్మాహుతికి పాల్పడింది. ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తుండడంతో భరించలేక తనకు తానే నిప్పంటించుకొని మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది.