తాళం పగులగొట్టి చోరీలు | 'Lock' braked thefts | Sakshi
Sakshi News home page

తాళం పగులగొట్టి చోరీలు

Oct 18 2016 8:15 PM | Updated on Aug 20 2018 4:27 PM

తాళం పగులగొట్టి చోరీలు - Sakshi

తాళం పగులగొట్టి చోరీలు

ఎవరూ లేని ఇళ్లకు వెళ్లి చాకచక్యంగా తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
 
గుంటూరు (పట్నంబజారు): ఎవరూ లేని ఇళ్లకు వెళ్లి చాకచక్యంగా తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్‌ చంద్ర కాన్ఫెరెన్స్‌ హాలులో మంగళవారం రూరల్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లా డైకాస్‌ రోడ్డుకు చెందిన షేక్‌ ఫయాజ్‌ దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 2015 సంవత్సరంలో ములోషాద్‌నగర్‌లో ఓ దొంగతనం కేసులో అరెస్టు అయినప్పుడు రంగారెడ్డిజిల్లా మహరాజ్‌పేట ఏరుకుంట తండాకు చెందిన విస్లావత్‌ రామునాయక్‌తో పరిచయం ఏర్పడింది.  ఈసంవత్సరం జైలులో నుంచి బయటకు వచ్చిన ఫయాజ్, రామునాయక్‌లు గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం, రాజమండ్రి, తణుకు, బొమ్మూరు, తదితర ప్రాంతాల్లో 15కు పైగా దొంగతనాలు చేశారు. ముందుగా ఇద్దరూ పక్కా రెక్కి నిర్వహించి ఇంటికి తాళాలు వేసే నివాసాలను గమనిస్తారు. రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి వస్తువులు దోచుకుపోతారు. వివిధ ప్రాంతాల్లో ఏడు కార్లు సైతం దొంగిలించుకు పోయారు. గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు, కార్లు చోరీ జరుగుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించిన రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ళలోని కొండమోడు జంక్షన్‌ వద్ద ఫయాజ్, రామునాయక్‌లు మంగళవారం కారులో వెళుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు.
 
పూర్తి స్థాయిలో చేసిన దొంగతనాల వివరాలను వివరించి, చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.   వారి నుంచి ఏడు కార్లు, బంగారు ఆభరణాలు, మొత్తం రూ. 30,26,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో సైతం ఫయాజ్‌ ఒక హత్య, యాసిడ్‌ దాడి కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైమ్‌ డీఎస్పీ ఎన్‌.కృష్ణకిషోర్‌రెడ్డి, పిడుగురాళ్ళ సీఐ హనుమంతరావు, క్రైమ్‌ సీఐ ఎం.నాగేశ్వరరావు, ఎస్సై పి.కిరణ్, కానిస్టేబుళ్లను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement