రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఆత్మహత్యల నివారణకు పంజాబ్, కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.
హుజూరాబాద్:
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఆత్మహత్యల నివారణకు పంజాబ్, కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో, ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన రైతుదీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం నడుస్తున్న క్రమంలో రైతు సమస్యలపై చర్చించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ 40 సంఘాల నాయకులతో చర్చించారని, ఇందులో అనేక సూచనలు చేయగా, ప్రధానంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
ప్రభుత్వం ఆయా సంఘాలు చేసిన సూచనలు బాగున్నాయని పేర్కొంటూ కోర్టుకు నివేదించినప్పటికీ ఆ సూచనల అమలుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి అనేక ప్రయత్నాలు జరిగిన తర్వాతనే జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రైతుదీక్షను తలపెట్టినట్లు తెలిపారు. ప్రధానంగా రైతులకు వ్యవసాయ విధానం ప్రకటించాలని, మార్కెట్ దోపిడి నుంచి కాపాడే చర్యలు చేపట్టాలని కోదండరామ్ అన్నారు.
మిర్చి, సోయా, పెసర వంటి నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం రావాలని, ఇందుకు వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేరమయ రాజకీయాలను అంతం చేయాలని, నయీమ్‌తో సంబంధమున్న వారి పేర్లు కొన్ని బయటకు వస్తున్న క్రమంలో వారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేయడంతో పాటు పదవుల నుంచి తొలగించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. నాయకులు, నేరగాళ్లు, పోలీసులు ఒక్కటై భూములను రాయించుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న క్రమంలో నేరమయ రాజకీయాలను అంతం చేసేందుకు అందరూ ప్రయత్నించాలన్నారు. నయీమ్‌తో సంబంధమున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.