ఆశీస్సులున్నవారికే... | KGBV staff as Political interference in Employment | Sakshi
Sakshi News home page

ఆశీస్సులున్నవారికే...

Jun 18 2016 1:41 AM | Updated on Sep 19 2019 8:59 PM

ఆశీస్సులున్నవారికే... - Sakshi

ఆశీస్సులున్నవారికే...

‘వడ్డించేవారు మనవారైతే... కడబంతిలో కూచున్నా ఫర్వాలేదు’ అన్న సామెత ఇక్కడ అచ్చంగా సరిపోతుంది. అధికారం అండగా ఉంటే ఏదైనా....

‘వడ్డించేవారు మనవారైతే... కడబంతిలో కూచున్నా ఫర్వాలేదు’ అన్న సామెత ఇక్కడ అచ్చంగా సరిపోతుంది. అధికారం అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చన్న దానికి ఇది అద్దం పడుతోంది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగుల కొనసాగింపుపై రాజకీయ క్రీనీడలు కమ్ముకున్నాయి. మెరుగైన పనితీరు కనబర్చినా... వారిని తప్పించేసి, ఆరోపణలు ఎదుర్కొన్నవారిని కొనసాగించడం చూస్తే ఈ వాస్తవాలు రుజువవుతున్నాయి. గ్రేడుల పేరుతో గందరగోళం సృష్టించి... పారదర్శకత పేరుతో పక్షపాత ధోరణితో వ్యవహరించి... 150మంది భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేశారు.
 
* కేజీబీవీ సిబ్బంది కొనసాగింపులో రాజకీయ జోక్యం ?
* పనితీరు నిర్ధారణలో వివక్ష
* మెరుగైన పనితీరు చూపించినవారికి సీ గ్రేడ్
* ఆరోపణలున్న వారికే పెద్దపీట
* ప్రశ్నార్థకంగా మారిన 150మంది భవిష్యత్

సాక్షి ప్రతినిధి, విజయనగరం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో రాజకీయ జోక్యం పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తాత్కాలిక ప్రాపతిపదికన పనిచేసే ఉద్యోగుల్ని ఏప్రిల్ వరకూ పనిచేయించుకుని, తిరిగి జూన్‌లో వారి ఉద్యోగాలను పునరుద్ధరిస్తారు.

ఇక్కడ పనిచేసే ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు, అకౌంటెం ట్లు, ఏఎన్‌ఎంలు, కుక్‌లు ఇలా ప్రతీ ఒక్కరికీ ఏడాది ప్రాతిపదికనే రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. ఈసారి సిబ్బంది కొనసాగింపులో మాత్రం పనితీరును ప్రామాణికం పేరుతో రాజకీయ జోక్యానికి తెరతీస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వారినే రెన్యువల్ చేస్తే తమ వారికి అవకాశం రాదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు పన్నిన వ్యూహమే పనితీరు ప్రామాణికమని వారు వాదిస్తున్నారు.
 
150 మందికి రెన్యువల్ నిలిపివేత
జిల్లాలో 33కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 625మంది పనిచేస్తున్నారు. వీరందరినీ పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించారు. ఏ, బీ గ్రేడ్‌ల వారికి రెన్యువల్ ఉత్తర్వులు అందజేసి, సీ గ్రేడ్‌లొచ్చిన వారికి నిలిపేసారు. 12మంది ప్రత్యేకాధికారులు, 50మంది సీఆర్‌టీలు, 33మంది అకౌంటెంట్లు, 14మంది ఏఎన్‌ఎంలతో పాటు పలువురు కుక్‌లు, పీఈటీలు ఇలా గాలిలో ఉన్నారు.
 
గ్రేడ్‌ల నిర్ధారణపై ఆరోపణలు
మెరుగైన ఫలితాలు, మంచి ప్రతిభ కనబరిచిన వారికి సీ గ్రేడ్‌లిచ్చి, ఆరోపణలు ఉన్న వారికి ఏ, బీ గ్రేడ్‌లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
* రాష్ట్ర ఫైనాన్స్ కంట్రోల్ పర్యటనలో విద్యార్థులకు గుడ్లు పెట్టడం లేదని, చిన్న చిన్న అరటి పండ్లు, కుళ్లిన కూరగాయలు వండి పెడుతున్నారని ఓ కేజీబీవీని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశా రు. దానికి మంచి గ్రేడ్ ఇచ్చినట్టు సమాచారం.
* ఓ కేజీబీవీలో విద్యార్థిని మృతిచెంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యాలయం నిర్వహణ సరిగా లేదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం లేదని, మెనూ కూడా సక్రమంగా అందించడం లేదని దానిపై ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పుడా కేజీబీవీని మెరుగైన గ్రేడ్‌లోకి తెచ్చారని చెబుతున్నారు.
* మరో కేజీబీవీలో 26మంది విద్యార్థులు అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. కానీ పనితీరు ప్రామాణికంలో మంచి గ్రేడ్ ఇచ్చారు.
* ఓ ఇద్దరు ప్రత్యేకాధికారులు రోజూ విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించడంతో విద్యాలయాలు సరిగా నడవడం లేదన్న ఆరోపణలున్నాయి. వాటికి తొలి గ్రేడ్‌లే ఇచ్చారు.
* 100శాతం ఫలితాలు వచ్చిన పలు కేజీబీవీలను సీ గ్రేడ్‌లో పెట్టి, వాటి కన్న తక్కువ ఫలితాలొచ్చిన వాటికి ఏ, బీ గ్రేడ్‌లిచ్చినట్టు తెలుస్తోంది.  
 
ప్రత్యేక పరిశీలనలంటూ సన్నాయినొక్కులు
సీ గ్రేడ్‌లో పెట్టిన వారందరినీ నేరుగా పొమ్మనకుండా ప్రత్యేక పరిశీలన పేరుతో ప్రస్తుతానికి బుజ్జగించే కార్యక్రమం చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వకుండానే మూడు నెలల పాటు అదే విద్యాలయాల్లో పనిచేయించుకునే యత్నాలు చేస్తున్నారు. ఈ మూడు నెలల పనితీరును అధ్యయనం చేసి, సంతృప్తికరంగా ఉంటే రెన్యువల్‌పై ఆలోచిస్తామంటూ ఆ 150మందికి సూచించారు.

ఇదంతా చూస్తుంటే మూడు నెలలు పని చేయించుకుని సంతృప్తికరంగా లేదంటూ సాగనంపి, తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకేనని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజీవ్ విద్యా మిషన్ పీఓ లింగేశ్వరరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకామే గ్రేడింగ్‌లు ఇచ్చామని తెలిపారు. ఎక్కడా రాజీపడలేదని చెప్పారు. గ్రేడ్లు ఇవ్వడంలో లోటుపాట్లు ఉన్నాయని ఇంతవరకూ ఉన్నతాధికారులకు గానీ, తనకు గానీ ఫిర్యాదులు రాలేదనీ, ఒకవేళ వస్తే పరిశీలిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement