పోలీసుల చేతగానితనంతోనే దాడులు
పోలీసుల చేతగానితనంతోనే ధర్మవరంలో దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.
	– ధర్మవరంలో దిగజారిన శాంతిభద్రతలు
	– పంచాయితీలకే పరిమితమైన ఖాకీలు
	– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధ్వజం
	
	అనంతపురం టౌన్ : పోలీసుల చేతగానితనంతోనే ధర్మవరంలో దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను శుక్రవారం ఆయన పరామర్శించారు.  అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మవరంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారుతున్నాయన్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ధర్మవరంలోని ఒకటో వార్డులో నాలుగు రోజులుగా ఘర్షణ వాతావరణం ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు.
	
	ఖాదర్‌బాషాపై దాడి జరిగాక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడని, ఈ సమయంలో ఎస్‌ఐ కేసు నమోదుకు నిరాకరించారని చెప్పారు. కనీసం విచారణ కూడా చేసిన పాపానపోలేదన్నారు. పైగా మీరే కొట్టుకున్నారంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారని, ఈ క్రమంలోనే నిందితులు మళ్లీ దాడి చేశారన్నారు. ధర్మవరంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని, కేవలం పంచాయితీలు చేసుకోవడానికే సరిపోయిందని విమర్శించారు. సాటి కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపై టీడీపీ నాయకులు కొట్టినా నామమాత్రపు చర్యలు తీసుకున్నారన్నారు. ఇదంతా డీఎస్పీ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
	
	ఇటీవల పరిటాల, సూరి వర్గాల మధ్య గొడవ జరిగిందని, అందులోని నిందితులే ఇప్పుడు తమ కార్యకర్తలపై దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. అప్పట్లోనే వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు ఎంతోకాలం సాగవన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కేతిరెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ నేతలు సానే నరసింహులు, గడ్డం కుళ్లాయప్ప, ఈశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
