చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన డిమాండ్లు అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ జాతి నిరసన వ్యక్తం చేస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. శుక్రవారం
-
కాపు ఉద్యమనేత ముద్రగడ
కాకినాడ రూరల్ :
చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన డిమాండ్లు అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ జాతి నిరసన వ్యక్తం చేస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని జిల్లా కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు నివాసంలో కాపు జేఏసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలో చేర్చేస్తామని ప్రకటించి వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు మాట మారుస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన కాపులను తీవ్రవాదులుగా పరిగణిస్తున్నాడని ముద్రగడ అన్నారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. తాము సత్యాగ్రహ యాత్ర చేపడితే దానిని అడ్డుకునేందుకు 9 వేల మంది పైచిలుకు పోలీసులను కాపుల ఇళ్ల వద్ద ఉంచి గృహనిర్భంధించడం ఎంతవరకు సమంజసమన్నారు. హైకోర్టు పాదయాత్రకు ఒప్పుకున్నా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాము సంఘవిద్రోహశక్తులం కాదని, మేమూ భారతదేశంలోనే పుట్టామని, భారత రాజ్యాంగం తమకూ వర్తిస్తుందన్నారు. అంతే తప్ప ప్రత్యేక చట్టం ఉన్నట్లు, ఈ దేశం కాదన్నట్లు చంద్రబాబు వ్యవహారశైలి కన్పిస్తున్నదని ముద్రగడ విమర్శించారు. ఏది ఏమైనా తమ జాతి సంక్షేమం కోసం చేపట్టిన ఉద్యమం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆగే ప్రసక్తేలేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులంతా డిసెంబర్ 18 నుంచి అంచెలంచెలుగా ఉద్యమం చేపడతారని, తాను కూడా ఏదో ఒక జిల్లాలో ఉద్యమంలో పాల్గొంటానన్నారు. తాము ఉద్యమం చేసే తీరును కూడా ప్రభుత్వానికి వివరించామని, అవసరమైతే తమ చేతులకు బేడీలు వేసుకొని, కళ్లకు గంతలు కట్టాలని కూడా చెప్పామన్నారు. మంజునాథ కమిటీ ఎదుట బీసీ కులస్తుల వాదనలు అయిన తరువాత గాని, ముందుగాని తమకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ ప్రతినిధులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, కందుల దుర్గేష్, మలకల చంటిబాబు, నర్సే సోమేశ్వరరావు, ఆరేటి ప్రకాశరావు, కోట శ్రీనివాసరావు, పబ్బినీడి మణివిజయ్, రొక్కం సూర్యప్రకాశరరావు, సంజీవ్‌కుమార్, చిన్నమిల్లి రాయుడు తదితరులతో పాటు 13 జిల్లాల కాపు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.