వేటలేక.. పూట గడవక.. | Hunting in Fishermens wants Security | Sakshi
Sakshi News home page

వేటలేక.. పూట గడవక..

Jul 1 2016 1:13 AM | Updated on Sep 4 2017 3:49 AM

ఏక్షణాన ఏంజరుగుతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా పాల్మన్‌పేట గంగపుత్రులు ప్రాణ భీతితో కాలం వెళ్లదీస్తున్నారు.

* మొన్నటి వరకు వేటకు విరామం..
* ఇప్పుడేమో భయంతో ఊరు దాటని పరిస్థితి
* రెండు నెలలుగా  పస్తులు
* దుర్భరస్థితిలో పాల్మన్‌పేట గంగపుత్రులు

నక్కపల్లి/పాయకరావుపేట:  ఏక్షణాన ఏంజరుగుతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా  పాల్మన్‌పేట గంగపుత్రులు  ప్రాణ భీతితో కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగు రోజులు క్రితం వందలాది మంది అల్లరి మూకలు మూకుమ్మడిగా వచ్చి తమపై జరిపిన దాడి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు.

గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీటిపర్యంతమవుతున్నారు. అసలే రెండు నెలలపాటు వేటసాగక ఇంటివద్ద పస్తులున్న వీరిపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు గోరుచుట్టుపై రోకటి పోటు మాదిరిగా తయారయ్యాయి.  వారం రోజులనుంచి ప్రాణ భయంతో వేటకు వెళ్లక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామంలో సుమారు 2500 మంది మత్య్సకారులు జీవిస్తున్నారు.  వీరిలో 90 శాతం మంది వైఎస్సార్‌సీపీ  మద్దతుదారులే ఉన్నారు. తమకు పూర్తిస్థాయి భద్రత లభించే వరకు వేటకు వెళ్లడం సాధ్యంకాదని, వైరివర్గం నివసించే గ్రామం మీదుగానే తాము వేటకు వెళ్లాలని వారు పేర్కొంటున్నారు.  
 
రెండు నెలలుగా పస్తులు
ఇక్కడి మత్స్యకారులకు వేటకు వె ళ్తే తప్ప పూటగడవదు. అందరూ గంగమ్మ తల్లినే నమ్ముకుని జీవిస్తున్నారు. వేట విరామం కారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్15 వరకు  రెండు నెలల పాటు వీరు ఏ పనీలేకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం  ఇచ్చే పరిహారం సకాలంలో ఇవ్వడం లేదు. దీనికి తోడు తీరప్రాంతం వెంబడి ఏర్పాటవుతున్న రసాయన పరిశ్రమలు కూడా వీరి ఉపాధిని దెబ్బతీస్తున్నాయి.

కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాలు సముద్రంలో వదలడం వల్ల మత్స్య సంపద నాశనమవుతోంది. ఈ ప్రాంతంలో వేటసాగక  పొట్టచేతపట్టుకుని ఇతర  జిల్లాలకు వలసపోతున్నారు.  ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వీరిపై రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న భౌతిక దాడులు మరింత  ఆందోళనకు గురిచేస్తున్నాయి.  రెండు పక్క పక్క గ్రామాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను  ఆసరాగా తీసుకుని పొరుగు జిల్లాకు చెందిన వారు వీరిపై దాడులకు పాల్పడంతో వణికిపోతున్నారు.  

తమపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేశామని, దీన్ని జీర్ణించుకోలేక మళ్లీ దాడులకు తెగబడతారేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది. గ్రామంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినప్పటికీ వీరిలో భయం వీడలేదు.  ఈ దాడులకు సంబంధించి పోలీసులు ఇంతవరకు 58 మందిని అరెస్టుచేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
 
రక్షణ కల్పించాలి
మా వాళ్లు వేటకు వెళ్తే తప్ప మా కడుపులు నిండవు. ప్రాణాలకు తెగించి ఆటుపోట్ల మధ్య  సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాలని ఒక వర్గం వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీన్నీ అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాప్రాణాలకు భద్రత కల్పించాలి.  మాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత.
- పిక్కి మేరి, పాల్మన్‌పేట బాధితురాలు
 
కుట్రలో భాగమే దాడులు
మా వాళ్లు అమాయకులు, మాలో మాకు వచ్చిన గొడవలను ఇతర గ్రామాల వారు అలుసుగా తీసుకుని రాజకీయంగా అణగదొక్కాలని  దాడులుచేశారు. వీరికి ప్రభుత్వంలో పెద్దల అండ ఉంది. ప్రత్యర్థులు లేకుండా చేయాలనే కుట్రలో భాగమే ఈ దాడులు. ఏ సంబంధంలేని పది గ్రామాల వారు వచ్చి మమ్మల్ని హత్యచేయాలని చూశారు.
- కె.గోపి, మత్స్యకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement