
అరెస్ట్‌లు చేయొద్దు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు అధికార పార్టీ పన్నిన కుయుక్తులకు హైకోర్టు చెక్‌పెట్టింది.
వైఎస్సార్‌సీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు స్టే
నాయుడుపేటటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు అధికార పార్టీ పన్నిన కుయుక్తులకు హైకోర్టు చెక్‌పెట్టింది. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వైఎస్సార్ సీపీ నాయకులపై నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై గురువారం హైకోర్టు స్టే విధించింది.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ రఫీ, సూళ్లూరుపేట నాయకులు పెమ్మారెడ్డి త్రిలోక చంద్రారెడ్డిపై నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు తమపై కక్షకట్టి అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఈ ముగ్గురు నాయకులను అరెస్ట్ చేయరాదంటూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు వీరిని అరెస్ట్ చేయకుండా ఈ కేసుపై విచారణను పోలీసులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంతో వైఎస్సార్ సీపీ నాయకులకు ఊరట లభించింది.